ఓటీటీ చిత్రాల్లో బూతులు.. చంద్రహాస్ కొత్త స్టేట్మెంట్..
ఓటీటీలో బూతు పదాలతో సినిమాలు వస్తాయని, అందరూ వాటిని చూస్తున్నారని తెలిపాడు. అందుకే సాంగ్ విషయంలో సారీ చెప్పనని అన్నాడు.;
బుల్లితెర యాక్టర్ ప్రభాకర్ కొడుకు, యంగ్ హీరో చంద్రహాస్.. కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషనల్ ఈవెంట్ లో గుంజి గుంజి సాంగ్ పాడి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఆ పాటలోని బూతు పదాలు.. తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అనేక మంది నెటిజన్లు, సెలబ్రిటీలు మండిపడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెబుతున్నారు.
సాంగ్ విషయంలో సారీ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ చంద్రహాస్ మాత్రం తగ్గడం లేదు. క్షమాపణలు చెప్పడం లేదు. తనపై ఇప్పటికే గతంలో ఎన్నో విమర్శలు చేశారని, బూతులు పెట్టారని.. దాన్ని తాను క్రిటిసిజంగా తీసుకున్నారని ఓ వీడియోలో తెలిపాడు. పాటలోని బూతులు ఒరిజనల్ సాంగ్ లో లేవని, తాను కేవలం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి తానే సృష్టించినట్టుగా వెల్లడించాడు.
అయితే ఈవెంట్ లో పాట పాడినప్పుడు కొందరు అభినందించారని, క్లాప్స్ కొట్టారని చంద్రహాస్ అన్నాడు. ఆ తర్వాత ఇంకో వీడియోలో అసలు తాను సారీ ఎందుకు చెప్పాలని అడిగాడు. అప్పట్లో తాను ఆత్మహత్య చేసుకుంటే ఏమయ్యేదని కూడా క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న చంద్రహాస్.. తన పాటను సమర్థించుకున్నాడు.
ఓటీటీలో బూతు పదాలతో సినిమాలు వస్తాయని, అందరూ వాటిని చూస్తున్నారని తెలిపాడు. అందుకే సాంగ్ విషయంలో సారీ చెప్పనని అన్నాడు. అంతే కాదు డిబేట్ యాంకర్ పై ఫైర్ అయ్యాడు. అదే డిబేట్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు సంధ్యా రెడ్డి.. చంద్రహాస్ కు చురకలంటించారు. ఈటీవీ ప్రభాకర్ ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడని.. తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు.
అందుకే ఆయన పేరును చెడగొట్టొద్దని, నేటి తరం హీరోలు ఎలా ఉన్నారో చూసి నేర్చుకోవాలని చంద్రహాస్ కు ఆమె సూచించారు. స్టేజ్ పై బూతుల పాటను పాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా.. ఎప్పుడైనా.. సమాజానికి మంచిని పంచే సినిమాలు తీయాలని, మెసేజ్ ఇచ్చే చిత్రాలు చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ ఇలాంటి బూతు పాటలు వద్దని సలహా ఇచ్చారు.
అయితే చంద్రహాస్ మాత్రం తన పాటను సమర్థించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికైనా సారీ చెప్పి.. ఇక్కడితో ఆపాలని సూచిస్తున్నారు. అనవసరమైన డిబేట్స్ ఎందుకుని.. బూతులతో పాట పాడడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. మరి ఈ వ్యవహారంలో చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.