సుధా కొంగర Vs డాన్ పిక్చర్స్.. అసలేం జరుగుతోంది? ఎవరిది నిజం?

కోలీవుడ్‌ లో ఇప్పుడు ఆసక్తికరంగా మారిన వివాదం డైరెక్టర్ సుధా కొంగర, డాన్ పిక్చర్స్ మధ్య రెమ్యూనరేషన్ చెల్లింపుల వ్యవహారం.

Update: 2026-07-10 10:44 GMT

కోలీవుడ్‌ లో ఇప్పుడు ఆసక్తికరంగా మారిన వివాదం డైరెక్టర్ సుధా కొంగర, డాన్ పిక్చర్స్ మధ్య రెమ్యూనరేషన్ చెల్లింపుల వ్యవహారం. ఒకవైపు తనకు రావాల్సిన రూ.8.39 కోట్ల బకాయిలను నిర్మాతలు చెల్లించలేదని సుధా కొంగర కోర్టును ఆశ్రయిస్తే.. మరోవైపు ఆమె ఇప్పటికే రూ.4.12 కోట్లు తీసుకున్న విషయాన్ని కోర్టు ముందు దాచిపెట్టారని డాన్ పిక్చర్స్ ఆరోపణలు చేసింది. దీంతో అసలు నిజం ఎవరిది? అనే చర్చ హాట్‌ టాపిక్‌ గా మారింది.

శివకార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమా విడుదలై కొన్ని నెలలు గడిచిన తర్వాత పారితోషికం వివాదం బయటకొచ్చింది. సుధా కొంగర మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తూ.. పరాశక్తి కోసం తనతో రూ.15 కోట్ల పారితోషికానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, జీఎస్టీతో కలిపి రూ.17.70 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.9.31 కోట్లు మాత్రమే అందాయని పేర్కొన్నారు.

మిగిలిన రూ.8.39 కోట్లను వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా తన బకాయిలు చెల్లించే వరకు డాన్ పిక్చర్స్ నిర్మించిన తదుపరి చిత్రం ఇదయం మురళి విడుదలను నిలిపివేయాలని కూడా కోర్టును కోరారు. అయితే ఆ కేసులో డాన్ పిక్చర్స్ పూర్తిగా భిన్నమైన వాదన వినిపించింది. పరాశక్తి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రచన కోసం సుధా కొంగర ఇప్పటికే 2డీ ఎంటర్టైన్మెంట్ నుంచి రూ.4.12 కోట్లు తీసుకున్నారని సంస్థ తెలిపింది.

ఆ మొత్తాన్ని తీసుకున్న తర్వాత సినిమాకు సంబంధించిన క్రియేటివ్ రైట్స్, ఇతర హక్కులన్నింటినీ అప్పగించే అగ్రిమెంట్ పై కూడా ఆమె సంతకం చేశారని కోర్టుకు వివరించింది. ఆ తర్వాత 2డీ ఎంటర్టైన్మెంట్ నుంచి పరాశక్తి హక్కులను రూ.5.8 కోట్లకు డాన్ పిక్చర్స్ కొనుగోలు చేసిందని, అనంతరం దర్శకురాలిగా సుధా కొంగరతో రూ.15 కోట్లకు కొత్త ఒప్పందం చేసుకున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఆమెకు జీఎస్టీ మినహా రూ.8.5 కోట్లు చెల్లించామని, గత ఒప్పందంలోని కండీషన్స్ గురించి తెలియకుండానే చెల్లింపులు జరిగాయని డాన్ పిక్చర్స్ వాదించింది.

ఇదిలా ఉండగా, సినిమా నిర్మాణ సమయంలో కొన్ని సీన్స్ లీక్ కావడంతో యాంటీ పైరసీ చర్యల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, దీంతో పాటు సినిమా కథ తనదేనంటూ మరో రైటర్ కోర్టును ఆశ్రయించడంతో ఖర్చులు పెరిగాయని నిర్మాతలు పేర్కొన్నారు. ఆ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం బకాయిల పేరుతో తదుపరి సినిమా విడుదలను నిలిపివేయడం సరికాదని కోర్టుకు వివరించారు. ఆ వాదనలు విన్న హైకోర్టు సుధా కొంగరకు రిలీఫ్ ఇవ్వలేదు.

అదే సమయంలో ఇదయం మురళి విడుదలను నిలిపివేయాలన్న అభ్యర్థనను అంగీకరించకుండా విచారణ కొనసాగిస్తోంది. ఆ వ్యవహారంపై కోర్టు తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుధ చెబుతున్న బకాయిల లెక్కలు, డాన్ పిక్చర్స్ చెబుతున్న చెల్లింపుల వివరాలు వేర్వేరుగా ఉండటంతో అసలు నిజం ఏంటనే దానిపై క్లారిటీ హైకోర్టు తీర్పుతోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News