'లెనిన్' మూవీ రివ్యూ
పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు.
నటీనటులు: అక్కినేని అఖిల్ - భాగ్యశ్రీ బోర్సే - ప్రమోద్ - శివాజీ- బ్రహ్మాజీ- ఈశ్వరి రావు - సునీల్-వడ్లమాని శ్రీనివాస్- గెటప్ శ్రీను- శరణ్య ప్రదీప్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో
నిర్మాతలు: నాగవంశీ - అక్కినేని నాగార్జున
రచన - దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
పదేళ్లకు పైగా ప్రయత్నిస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు క్లీన్ 'లెనిన్' అవతారం ఎత్తాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అక్కినేని కుర్రాడికి ఇప్పుడైనా కోరుకున్న హిట్ పడిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
చిత్తూరు జిల్లాలో భారతం మిట్ట అనే ఊరిలో అనాథ అయిన లెనిన్ (అఖిల్)ను వసంత్ (ప్రమోద్) చేరదీసి తనతో పాటుగా తన కుటుంబంలో ఒకడిగా పెరిగేలా చేస్తాడు. వసంత్ కుటుంబానికే కాదు.. ఆ ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ లెనిన్ అందరికి ఇష్టుడిగా మారతాడు. లెనిన్.. భారతి (భాగ్యశ్రీ బోర్సే) ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకోవాలని అనుకుంటారు. అంతలో అనూహ్య పరిస్థితుల్లో భారతిని ప్రమోద్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. మరి ప్రమోద్ తోనే భారతి పెళ్లి జరిగిందా..భారతిని లెనిన్ వదులుకున్నాడా.. ఈ పెళ్లి వ్యవహారం భారతి మిట్టలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అన్నది.మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఏ హీరో కూడా నేరుగా స్టార్ అయిపోడు. సినిమాలు క్లిక్ అయితే స్టార్ ఇమేజ్ ఆటోమేటిగ్గా వస్తుంది. పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వల్ల ఒక హీరోకు హైప్ వచ్చినా.. దాన్ని నిలబెట్టే సినిమా పడితేనే కెరీర్లో పైకి ఎదిగే అవకాశముంటుంది. అక్కినేని అఖిల్ కెరీరే ఇందుకు ఉదాహరణ. అరంగేట్రానికి ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్నప్పటికీ.. సరైన సినిమాలు చేయకపోవడం వల్ల కెరీర్ మొదలైన పదేళ్ల తర్వాత కూడా క్రాస్ రోడ్స్‌లోనే నిలబడ్డాడు అక్కినేని కుర్రాడు. ఆలస్యంగా తత్వం బోధ పడిందో ఏమో.. ఈసారి మాస్ ఇమేజ్.. ఎలివేషన్లు అంటూ నేల విడిచి సాము చేయకుండా ‘లెనిన్’ రూపంలో కథ ప్రధానంగా సాగే సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు అఖిల్. హీరో కోసం కథ అని కాకుండా.. కథలో భాగంగా హీరో అనిపించే సినిమా చేశాడతను. పల్లెటూరి నేపథ్యంలో ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. కానీ ఆసక్తికరమైన పాత్రలు.. థ్రిల్లర్ సినిమాల తరహా ట్విస్టులతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని పంచే ప్రయత్నం చేసింది ‘లెనిన్’. ఐతే డ్రామా అనుకున్నంతగా పండకపోవడం.. పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడం వల్ల ‘లెనిన్’ గొప్ప అనుభూతిని అయితే అందించలేకపోయింది. అదే సమయంలో ‘లెనిన్’ బోరింగ్ అనే ఫీలింగ్ కూడా కలిగించదు. రెండున్నర గంటలు అలా అలా టైంపాస్ అయితే చేయించేస్తుంది.
చిత్తూరు జిల్లాలోని పల్లెటూళ్లలో ఏటా జరిగే మహాభారత నాటక ప్రదర్శన నేపథ్యంలో సాగే ‘లెనిన్’లో భారతాన్ని పోలిన పాత్రలు.. కథను చూపించాడు దర్శకుడు మురళీ కిషోర్. మహా భారతంలో ఉండే స్నేహం.. నమ్మక ద్రోహం.. కుట్రలు కుతంత్రాలు.. అనుమానాలు.. అవమానాలు.. అన్నీ ఈ కథలోనూ చూడొచ్చు. కథ విషయంలో మురళి ఎంతో కసరత్తు చేసిన విషయం తెరపై కనిపిస్తుంది. ప్రతి ముఖ్య పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉండేలా చూసుకున్నాడు. కాకపోతే పాత్రలు బాగున్నా.. ఒక పాత్రకు ఇంకో పాత్రకు మధ్య కనెక్షన్ కానీ.. కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడమే ‘లెనిన్’కు మైనస్ అయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో లోతును చూపించలేకపోవడం.. విలన్ పాత్ర విపరీత ప్రవర్తనకు.. అతను పగతో రగిలిపోవడానికి బలమైన కారణాన్ని పెట్టకపోవడం వల్ల సినిమాలో ఎమోషన్ క్యారీ అవ్వలేదు. మొదట్లో ప్రేమ సన్నివేశాలను చాలా మామూలుగా నడపించేయడంతో ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్లో భావోద్వేగాలు పండలేదు. విలన్ పన్నే కుట్రలకు.. అతను చేసే బీభత్సానికి సరైన కారణమే చూపించలేకపోయారు. తన పాత్ర విషయంలో ట్విస్ట్ కూడా సరిగా పండలేదు. అతను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు.. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తాయంటే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బ తిన్నట్లే. ఏదో ట్విస్టు కోసం ట్విస్ట్ అన్నట్లుగా ఈ పాత్రను తీర్చిదిద్దడం మైనస్ అయింది. ఈ పాత్రను అర్థవంతంగా.. లాజికల్ గా తీర్చిదిద్ది ఉంటే ‘లెనిన్’లో కొన్ని ఎపిసోడ్లు బలంగా పేలేవి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య బంధానికి బలమైన పునాది పడి ఉంటే.. ఇంకో ఎపిసోడ్ కూడా గుండెలు పిండేసేది.
ఐతే కొన్ని లోపాల వల్ల డ్రామా అంతగా పండలేదు కానీ.. ‘లెనిన్’లో విడివిడిగా సన్నివేశాలు చూస్తే బాగానే అనిపిస్తాయి. కొన్ని ఎపిసోెడ్లు బాగా పేలాయి. ఆసక్తికర ఆరంభ సన్నివేశాల తర్వాత.. లవ్ సీన్లు బోర్ కొట్టించినా.. ఎట్టా ఎట్టా-వారెవా పాటలు అలరిస్తాయి. ప్రి ఇంటర్వెల్ దగ్గర్నుంచి ‘లెనిన్’ మంచి టెంపోతో సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్టును బాగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక బ్యాంగ్ లాగా పేలింది. ద్వితీయార్ధం కొంచెం ఎగుడుదిగుడుగా సాగినా.. కథలో వచ్చే మలుపు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ యాక్షన్ ఘట్టాన్ని భారీగా-ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాలో అఖిల్ బెస్ట్ అవతార్-పెర్ఫామెన్సుని ఇక్కడ చూడొచ్చు. ఆ పాత్రలో ఒక ఊహించని కోణాన్ని కూడా దర్శకుడు ఇక్కడ పరిచయం చేస్తాడు. ఆ ట్విస్టును కథతో లింక్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ప్రి క్లైమాక్స్ ఎపిసోడ్లో ఎమోషన్ బలంగా పండి ఉంటే.. ‘లెనిన్’ రేంజ్ మారిపోయేది. అయినా సరే చివరికి ఓకే అనిపిస్తుంది. కథ కోసం ట్విస్టులు అని కాకుండా ట్విస్టుల కోసం కథ అన్న ఫీలింగ్ కలిగించినప్పటికీ.. ‘లెనిన్’లో మలుపులు ఈ సినిమాను ఎంగేజింగ్ గా మార్చాయి. అఖిల్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్.. భాగ్యశ్రీ గ్లామర్.. అందమైన విజువల్స్.. చక్కగా చిత్రీకరించిన పాటలు.. భారీతనంతో కూడిన యాక్షన్ ఘట్టాలతో సగటు ‘లెనిన్’ కమర్షియల్ సినిమా నుంచి ఆశించే వినోదాన్ని అందిస్తుంది. అఖిల్ కెరీర్ ను గొప్ప మలుపు తిప్పే సినిమా కాదు కానీ.. అతడి గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ ఎంతో బెటర్. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే వాచబుల్ అనిపించే ఫిలిం ఇది.
నటీనటులు:
అక్కినేేని అఖిల్.. తన అవతారంతో పాటు నటననూ మార్చుకుని పూర్తి భిన్నంగా కనిపించాడు ‘లెనిన్’లో. ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’లో నాగార్జున లుక్ స్ఫూర్తితో తన గెటప్ ట్రై చేసినట్లు అనిపిస్తుంది. తన గత సినిమాల ఛాయల నుంచి పూర్తిగా బయటికి వచ్చి పల్లెటూరి కుర్రాడిగా ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు అఖిల్. ముఖ్యమైన ఎపిసోడ్లలో తన నటన ఆకట్టుకుంటుంది. ప్రి క్లైమాక్సులో వచ్చే ఎమోషనల్ సీన్.. పతాక ఘట్టంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో అఖిల్ బాగా చేశాడు. కొన్ని చోట్ల నటన కాస్త అటు ఇటుగా అనిపించినా.. గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ పెర్ఫామెన్స్ చాలా మెరుగ్గా అనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే తన అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న కథానాయిక ఇలాంటి పాత్రలో మెప్పించడం అంత తేలిక కాదు. తన హావభావాలు బాగున్నాయి. హీరోతో సమానంగా అనిపించే పాత్రలో కన్నడ నటుడు ప్రమోద్ బాగా చేశాడు. కొన్ని చోట్ల అతను హీరోను కూడా డామినేట్ చేశాడు. ఎత్తిరాజులు పాత్రలో శివాజీ అదరగొట్టాడు. ఈశ్వరీ రావు కూడా ఆకట్టుకుంది. సునీల్ పాత్రలో పెద్దగా విషయం లేదు. తన పెర్ఫామెన్స్ ఓకే. వడ్లమాని శ్రీనివాస్.. గెటప్ శ్రీను.. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
‘లెనిన్’కు తమన్ సంగీతం అతి పెద్ద ఆకర్షణ. ఎట్టా ఎట్టా.. వారెవా సాంగ్స్ వీనుల విందుగానే కాదు కనువిందుగానూ అనిపిస్తాయి. మిగతా పాటలు కూడా బాగున్నాయి. కానీ పాటల ప్లేస్మెంట్ అంత బాగా లేదు. అసందర్భంగా వచ్చి పడ్డ ఫీలింగ్ కలిగిస్తాయి. తమన్ బీజీఎం బాగుంది. కొన్ని చోట్ల అవసరానికి మించిన ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపిస్తుంది కానీ.. చాలా వరకు బీజీఎం సన్నివేశాలకు బలం చేకూర్చింది. లియాన్ బిట్రో విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కుదిరాయి. క్వాలిటీ సినిమా చూస్తున్న భావన కలిగేలా బాగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. రైటర్ కమ్ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు.. కథ విషయంలో మెప్పించాడు. హీరో చుట్టూ కథను తిప్పకుండా.. కథలో హీరోను భాగం చేయడం బాగుంది. మహాభారతం అల్లుకున్న తన కథ ఆసక్తి రేకెత్తిస్తుంది. పాత్రలు కూడా బాగున్నాయి. కానీ క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. విలన్ పాత్రను ఇంకా అర్థవంతంగా తీర్చిదిద్ది.. హీరో హీరోయిన్ల మధ్య బలమైన బాండింగ్ ను చూపించి ఉంటే ‘లెనిన్’ మంచి అనుభూతిని కలిగించేది. రైటింగ్-టేకింగ్ లో తన ఎఫర్ట్ కనిపించినా.. ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది అనిపిస్తుంది.
చివరగా: లెనిన్.. పర్వాలేదనిపించే పల్లెటూరి భారతం
రేటింగ్ - 2.5/5