సెట్ లో నిర్మాత దర్శకుడికి కళ్లెం వేయకూడదు!
సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక ప్రక్రియ. ఒక సినిమాను తెరకెక్కించే క్రమంలో దర్శక, నిర్మాత మధ్య ఉండాల్సిన సమన్వయంపై టాలీవుడ్ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక ప్రక్రియ. ఒక సినిమాను తెరకెక్కించే క్రమంలో దర్శక, నిర్మాత మధ్య ఉండాల్సిన సమన్వయంపై టాలీవుడ్ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. షూటింగ్ సెట్‌లో నిర్మాత ఉండటం వల్ల ఖర్చు తగ్గుతుందనేది అపోహ మాత్రమేనని, పైగా అది అనవసరమైన గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. దర్శకుడి పనిలో నిర్మాత జోక్యం చేసుకోవడం వల్ల సినిమా నాణ్యత దెబ్బతినడమే కాకుండా సృజనాత్మకతకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు.
సెట్‌లో ఉన్నప్పుడు టెక్నీషియన్లు గానీ, ఇతర సిబ్బంది గానీ ఏదైనా అవసరమని అడిగినప్పుడు, నిర్మాత అక్కడ ఉంటే వద్దు అని చెప్పడం సాధ్యం కాదు. ఆ సమయంలో ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గదని నాగవంశీ అన్నారు. . నిర్మాణం సవ్యంగా సాగాలంటే? దర్శకుడికి తన పని తాను చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. నిర్మాత ఎప్పుడూ సెట్‌లో ఉండి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ దర్శకుడిని నియంత్రించాలని చూస్తే ఆ పనిలో సహజత్వం లోపిస్తుందని తాను బలంగా నమ్ముతానన్నారు.
దర్శకుడి పీక మీద కత్తి పెట్టి పని చేయించకూడదు అనేది నాగవంశీ ప్రధాన వాదన. సినిమా అనేది ఒక కలయిక. అందులో దర్శకుడి విజన్ ముఖ్యమైనది. ఆ విజన్‌కు అనుగుణంగా వనరులను సమకూర్చడం నిర్మాతల బాధ్యత. అంతే కానీ షూటింగ్ జరుగుతున్న ప్రతి నిమిషం ఖర్చుపైనే దృష్టి పెట్టి దర్శకుడిని ఒత్తిడికి గురి చేస్తే అతను అనుకున్న అవుట్‌పుట్ రాదు. సినిమా కోసం అవసరమైన ఖర్చు ఎలాగూ అవుతుంది. అది సెట్‌లో నిర్మాత ఉన్నా లేకున్నా మారుతుందే తప్ప ఆగేది కాదని గుర్తు చేశారు.
నాగవంశీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. సినిమా కోసం కోట్లు ఖర్చు చేసేటప్పుడు ఆ పెట్టుబడిపై దృష్టి పెట్టడం నిర్మాతల బాధ్యతే అయినప్పటికీ షూటింగ్ స్పాట్‌లో దర్శకుడిని స్వేచ్ఛగా వదిలేయడం వల్ల అతను తన ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే అవకాశం ఉంటుంది. సెట్‌లో నిర్మాతల అతి జోక్యం వల్ల దర్శకులు క్రియేటివ్ ఫ్రీడమ్ కోల్పోయి సినిమా ఫలితంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ప్రస్తుత కాలంలో పద్ధతులు మారుతున్నాయి. నిర్మాత తన ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎలా తిరిగి రాబట్టుకోవాలి లేదా సినిమా క్వాలిటీ ఎలా ఉండాలి అనే దానిపై ముందుగానే చర్చించుకుంటే సరిపోతుంది. షూటింగ్ సమయంలో మాత్రం దర్శకుడికి పూర్తి స్థాయి బాధ్యత అప్పగించి నిర్మాతలు పర్యవేక్షకులుగా మాత్రమే ఉండాలని నాగవంశీ వ్యాఖ్యల సారాంశం. ఇది పరిశ్రమలో ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
నిర్మాతలు -దర్శకుల మధ్య ఉండాల్సిన సంబంధం ఒకరిపై ఒకరు గౌరవం పెంచుకునేలా ఉండాలి. సినిమా నాణ్యత పెరగాలంటే దర్శకుడికి కావాల్సిన స్వేచ్ఛను ఇవ్వడం తప్పనిసరి. నిర్మాతలు సెట్‌లో ఉండి నిఘా పెట్టడం కంటే ప్లానింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని నాగవంశీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే దర్శకుడు స్వేచ్ఛగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.