గుడిలో సిగరెట్ కాల్చుతూ వీడియో.. చిన్మయి రివీల్ చేసిన అసలు విషయమిదే..

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులపై స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-07-10 10:17 GMT

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులపై స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎక్స్‌ లో వైరల్ అయిన ఓ పోస్టును ప్రస్తావిస్తూ.. నిజానిజాలు తెలుసుకోకుండా చేసే ప్రచారం ప్రజలపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ మేరకు వీడియో మెసేజ్ ను పోస్ట్ చేయగా, అది ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

చిన్మయి తెలిపిన వివరాల ప్రకారం.. రెండు మూడు రోజుల క్రితం వరాహా వారియర్ అనే ఎక్స్ అకౌంట్ లో ఓ యువకుడు ఆలయంలో సిగరెట్ వెలిగిస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోకు వాస్తవాలకు భిన్నమైన విషయాలను యాడ్ చేసి ప్రచారం చేసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆ వీడియోకు సంబంధించిన అసలు విషయం వేరుగా ఉందని చిన్మయి చెప్పారు.

ఆ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగిందని, వీడియోలో కనిపించిన వ్యక్తి గురించి పోస్టులో చేసిన ప్రచారం నిజం కాదని చిన్మయి వివరించారు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదైనట్లు సమాచారం ఉందని, అయితే తర్వాత ఏం జరిగిందన్న దానిపై తన వద్ద పూర్తి వివరాలు లేవని చెప్పారు. అదే సమయంలో ఆ పోస్టులో అధికారిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్యాగ్ చేశారని చిన్మయి తెలిపారు.

అనంతరం గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఆ పోస్టులోని సమాచారం తప్పని స్పష్టం చేసినా.. అసలు పోస్టు ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొన్న ఆమె, తప్పుడు సమాచారం ఉన్న పోస్టుకు వేల సంఖ్యలో షేర్లు రావడం, అదే సమయంలో ఫ్యాక్ట్ చెక్ పోస్టుకు చాలా తక్కువ రెస్పాన్స్ రావడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దీంతో తప్పుడు సమాచారమే ఎక్కువ మందికి చేరి, అదే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక నెట్టింట ఇలాంటి తప్పుడు ప్రచారం సమాజంలో గొడవలకు కచ్చితంగా దారితీసే అవకాశం ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో, ఫొటో లేదా పోస్టును వెంటనే నమ్మకుండా, నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు చిన్మయి. క్రెడిబిలిటీ లేని సమాచారాన్ని షేర్ చేయకుండా సరైన విధంగా అంతా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వీడియో మెసేజ్ తో పాటు ఎక్స్‌ లో చేసిన మరో పోస్టులో కూడా చిన్మయి స్పందించారు. తప్పుడు సమాచారం ఉన్న పోస్టును అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ ఖండించినప్పటికీ, అది ఇంకా డిలీట్ చేయలేదని పేర్కొన్నారు. అలాగే అలాంటి పోస్టులపై కమ్యూనిటీ నోట్స్ కూడా కనిపించలేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వేగంగా గుర్తించి అడ్డుకునే సిస్టమ్ మరింత కరెక్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని చిన్మయి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతుండగా.. అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. దీంతో చిన్మయి రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.




Tags:    

Similar News