ఫ్యామిలీ డ్రామాల వైపు మొగ్గు చూపుతున్న ప్రేక్షకులు!

కొంత కాలంగా భారీ సెట్లు, రక్తపాతం, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో వెండితెర హోరెత్తిపోయింది. అయితే, మ‌ళ్లీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.

Update: 2026-07-10 11:30 GMT

కొంత కాలంగా భారీ సెట్లు, రక్తపాతం, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో వెండితెర హోరెత్తిపోయింది. అయితే, మ‌ళ్లీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. భారీ యాక్షన్ దృశ్యాల మధ్య ప్రేక్షకుడికి కావాల్సిన ఎమోషనల్ కనెక్ట్ కొరవడుతోందని గ్రహించిన మేకర్స్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ సక్సెస్ కోసం యాక్షన్ తప్పనిసరిగా భావించినా? ఇండస్ట్రీ ఇప్పుడు కుటుంబ బంధాల కథల్లోని మ్యాజిక్ ను మళ్లీ గుర్తిస్తోంది.

ప్రేక్షకులు ఇప్పుడు కేవలం అద్భుతమైన విజువల్స్ మాత్రమే కాదు. జీవితాల్లోని భావోద్వేగాలను ప్రతిబింబించే కథలను చూడాలనుకుంటున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం, అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు, ఉమ్మడి కుటుంబంలోని సరదా సంఘటనలు, గొడవలు వంటి అంశాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తున్నాయి. ఒక యాక్షన్ సినిమా ఇచ్చే కిక్ కంటే? మంచి ఫ్యామిలీ డ్రామా ఇచ్చే ఫీల్-గుడ్ అనుభూతిని ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చిన్న .. మధ్య తరహా బడ్జెట్ సినిమాల్లో కూడా ఎమోషనల్ డ్రామాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.

స్టార్ హీరోలు కూడా ఫ్యామిలీ సినిమాలకు సై అంటున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూనే మధ్యలో మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ద్వారా ప్రేక్షకులతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని భావిస్తున్నారు. ఎందుకంటే? యాక్షన్ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తే ఫ్యామిలీ డ్రామాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ థియేటర్లకు రప్పిస్తాయి. ఈ కోణంలో చూస్తే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు బాక్సాఫీస్ వద్ద సేఫ్ బెట్ గా మారుతున్నాయన్న‌ది కాద‌న‌లేనిజం.

ఇండస్ట్రీలోని దర్శకులు కూడా కొత్త రకం ఫ్యామిలీ డ్రామాలను రాసుకుంటున్నారు. పాతకాలపు పద్ధతిలో కాకుండా నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా కుటుంబాల్లో ఉండే సమస్యలను, వాటి పరిష్కారాలను సహజంగా చూపిస్తున్నారు. సోషల్ మీడియా, ఆధునిక జీవనశైలి వల్ల కుటుంబాల్లో వ‌స్తోన్న మార్పులను కథాంశాలుగా చేసుకుని వాటికి ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు. దీంతో ప్రేక్షకుడు సినిమాను చూస్తున్నంత సేపు తన కుటుం బంలోని మనిషిని తెరపై చూసుకుంటున్నట్లు ఫీల్ అవుతున్నాడు.

నిజానికి కుటుంబం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ అల్టీమేట్. ఎంత టెక్నాలజీ పెరిగినా? మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. యాక్షన్ సినిమాలు థ్రిల్ ఇస్తే, ఫ్యామిలీ డ్రామాలు హాయినిస్తాయి. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రేక్షకులు ఇలాంటి హాయినిచ్చే సినిమాలనే కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు గుర్తించి, కొత్తదనంతో కూడిన ఫ్యామిలీ సబ్జెక్టులను తెరకెక్కి స్తున్నారు. అనీల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేని, బాబి లాంటి ద‌ర్శ‌కులు త‌మ యాక్ష‌న్ క‌థ‌ల్లో అద్భుత‌మైన ఫ్యామిలీ ఎమోష‌న్ ద‌ట్టించ‌డంలో దిట్ట‌లు. అందుకే వారు ఇప్ప‌టికీ లైమ్ లైట్ లో ఉన్నారు? అన్న‌ది తెలిసిందే.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు మళ్లీ పూర్వవైభవం రావడం శుభపరిణామం. యాక్షన్ సినిమాల హడావిడి మధ్య కుటుంబ అనుబంధాల నేపథ్యంతో వచ్చే సినిమాలు ప్రశాంతమైన మలుపుగా నిలుస్తాయి. కథలో బలమైన ఎమోషన్ ఉన్నప్పుడు ఏ భాషాభేదం లేకుండా ఆ సినిమా విజయవంతం అవుతుంది. రాబోయే రోజుల్లో తెలుగు తెరపై మరెన్నో ఆణిముత్యాల్లాంటి ఫ్యామిలీ డ్రామాలు వస్తాయని ఆశిద్దాం.

Tags:    

Similar News