కంటెంట్ లో ఓటీటీలు వేళ్లు పెడుతున్నాయా?
సినిమా రిలీజ్ అన్నది ఇప్పటికే ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటీటీలో రిలీజ్ స్లాట్ బుక్ అయిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ తేదీ ఫిక్సవుతుంది.;

సినిమా రిలీజ్ అన్నది ఇప్పటికే ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటీటీలో రిలీజ్ స్లాట్ బుక్ అయిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్ తేదీ ఫిక్సవుతుంది. దీంతో రిలీజ్ విషయంలో నిర్మాత ప్రేక్షక పాత్రకే పరిమి తమవుతున్నాడు. ఎంత పెద్ద నిర్మాత అయినా ఓటీటీ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన సన్ని వేశం ఎదురైంది. అలా చేయకపోతే నో డీల్ అంటూ ఓటీటీలు కాలరెగరేస్తున్నాయి.
ప్రస్తుతం నిర్మాత పరిస్థితి అలా ఉంది. అయితే మును ముందు ఆ పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే అప్పుడు దర్శకులకు కూడా ఓటీటీలు చుక్కలు చూపిస్తాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే కొన్ని ఓటీటీ సంస్థలు సినిమా సెట్స్ కు వెళ్లక ముందే తమకు కూడా స్టోరీ చెప్పాలని అడుగుతున్నాయట.
కథ నచ్చితే డీల్ ఒకే చేసుకుంటాం లేక పోతే తాము కట్టిన రేట్ కే కంటెంట్ అమ్మాల్సి ఉంటుందని దర్శక, నిర్మాతలకు ఓటీటీలు చెబుతున్నాయట. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కొన్ని ప్రముఖ ఓటీటీలు చిన్న సినిమాల విషయంలోనే ఈ కండీషన్ అప్లై చేస్తున్నాయట. అలాగని పెద్ద సినిమాల విషయంలో లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు. సన్నివేశం వాళ్ల వరకూ వచ్చే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ అదే జరిగితే దర్శకుడు ఓటీటీ కి కూడా ఆరంభానికి ముందే స్టోరీ చెప్పి మెప్పించాలి. అలాగైతేనే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. లేదంటే కష్టమే. దర్శక, రచయితల కథల్ని హీరో-నిర్మాత ఒకే చేస్తే సరిపోదు. ఓటీటీలు కూడా ఒకే చేయాలి. ఓరకంగా ఇది మంచి విధానమే. సెట్స్ కు వెళ్లిన తర్వాత నాణ్యత లేని కంటెంట్ ఇవ్వడం కంటే ముందుగానే అందర్నీ మెప్పించగల్గితే? మరింత కాన్పిడెంట్ గా ప్రోడక్ట్ ని బయటకు తేవచ్చు.