సినిమా ఫెయిల్‌కు అసలు కారణం స్క్రిప్ట్ మార్పులేనా?

కానీ ఆ వెర్షన్ వెనుక ఎన్నో డ్రాఫ్టులు, మార్పులు, రీ రైట్ చేసిన సీన్స్, మార్చిన ట్విస్టులు, తీసేసిన పాత్రలు, కొత్తగా జోడించిన ఎండింగ్స్ ఉంటాయి.

Update: 2026-08-13 14:30 GMT

సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులు చూసేది రెండు నుంచి మూడు గంటల ఫైనల్ వెర్షన్ మాత్రమే. కానీ ఆ వెర్షన్ వెనుక ఎన్నో డ్రాఫ్టులు, మార్పులు, రీ రైట్ చేసిన సీన్స్, మార్చిన ట్విస్టులు, తీసేసిన పాత్రలు, కొత్తగా జోడించిన ఎండింగ్స్ ఉంటాయి. అందుకే ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత తరచుగా వినిపించే ప్రశ్న, అసలు మొదట రాసిన కథ ఇదేనా? అని.

సినీ ఇండ‌స్ట్రీలో స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ దశలో మార్పులు జరగడం కొత్త విషయం కాదు. ఒక రైట‌ర్ రాసిన కథ తర్వాత డైరెక్టర్ నేరేషన్‌కు అనుగుణంగా మారుతుంది. ఆ తర్వాత హీరో ఇమేజ్, మార్కెట్ అంచనాలు, నిర్మాతల కమర్షియల్ ఆలోచనలు, కొన్నిసార్లు డిస్ట్రిబ్యూషన్ అవసరాలు కూడా కథపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రక్రియలో అసలు కథలోని స్ట్రాంగ్ పాయింట్లు కొన్నిసార్లు మిగిలిపోతాయి, మరికొన్నిసార్లు పూర్తిగా మారిపోతాయి.

ఇండస్ట్రీలో దీనిని చాలామంది క్రియేటివ్ డైల్యూషన్ గా అభివర్ణిస్తారు. అంటే ఒక కథకు ఎక్కువ మంది క్రియేటివ్ రైట‌ర్స్ ఉన్న‌ప్పుడు, ప్రతి ఒక్కరి సూచనతో కథ కొద్దికొద్దిగా మారుతూ చివరకు మొద‌ట్లో అనుకున్న ఎమోష‌న్ లేదా థ్రిల్లింగ్ ఇంపాక్ట్ తగ్గిపోవచ్చు. ముఖ్యంగా థ్రిల్లర్, మిస్టరీ, సైకాలజికల్ డ్రామా వంటి జానర్లలో ఒక ట్విస్ట్ మారినా మొత్తం కథానిర్మాణం మారిపోయే అవకాశం ఉంటుంది.

ఇలాంటి డిస్క‌ష‌న్స్ ఎక్కువగా సినిమా ఫెయిల్ అయిన తర్వాతే బయటకు వస్తుంటాయి. నటీనటులు, రచయితలు లేదా టెక్నీషియ‌న్స్ ఇంటర్వ్యూలలో మొదట అనుకున్న వెర్షన్ వేరే అని చెప్పడం కొత్త విషయం కాదు. దీంతో మనం థియేటర్లలో చూసింది నిజంగా ఆ సినిమా అసలు రూపమేనా? అని ఆడియ‌న్స్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్న తలెత్తుతుంది.

హాలీవుడ్‌లో డైరెక్టర్స్ కట్, ఆల్టర్నేట్ ఎండింగ్స్, స్క్రిప్ట్ డ్రాఫ్ట్స్ వంటి అంశాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు రిలీజైన వెర్ష‌న్ కంటే తర్వాత వచ్చిన డైరెక్టర్స్ కట్‌కే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. దాంతో అసలు విజన్ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. టాలీవుడ్ లో మాత్రం అలాంటి క‌ల్చ‌ర్ చాలా పరిమితంగా ఉంది. ఎక్కువ సినిమాల ఒరిజినల్ స్క్రిప్టులు, ప్రత్యామ్నాయ ఎండింగ్స్, తొలగించిన కీలక సన్నివేశాలు ఆడియ‌న్స్ కు కనిపించవు. ఫలితంగా సినిమా ఫెయిల్ అయిన తర్వాత బయటకు వచ్చే కథలు నిజంగా ఎంతవరకు సరైనవి అనేది కూడా డిస్క‌ష‌న్ గానే మిగులుతోంది. అందులో భాగంగానే గ‌తేడాది అల్ల‌రి న‌రేష్ హీరోగా వ‌చ్చిన 12ఏ రైల్వేస్టేష‌న్ మూవీ అస‌లు క‌థ కూడా అది కాద‌ని, ఆ సినిమా ముందు అనుకున్న‌ది వేరే స్క్రిప్ట్ తోన‌ని, కానీ అది సెట్స్ పైకి వెళ్లాక పూర్తిగా మారిపోయింద‌ని ఆ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన కామాక్షి భాస్క‌ర్ల చెప్ప‌డంతో ఈ విష‌యంపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

Tags:    

Similar News