'ఓజీ' కోసం సుజీత్‌ వాడిన ఫార్ములా ఏంటీ?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఇచ్చిన బ‌డ్జెట్‌తో, ల‌భించిన టైమ్‌లో ప్రాజెక్ట్‌ని సుజీత్ ఎలా పూర్తి చేశాడ‌న్న‌ది అంద‌రి మ‌దిని తొలిచేస్తోంది.;

Update: 2025-12-29 19:30 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన పీరియ‌డ్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామా `ఓజీ`. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ర‌న్‌ రాజా ర‌న్‌, సాహో వంటి సినిమాల త‌రువాత యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ చేసిన భారీ మూవీ ఇది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో అటెన్ష‌న్‌ని డ్రా చేయ‌లేక‌పోయింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ప‌వ‌న్ క్రేజ్‌తో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని మాత్రం రాబ‌ట్టింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఇచ్చిన బ‌డ్జెట్‌తో, ల‌భించిన టైమ్‌లో ప్రాజెక్ట్‌ని సుజీత్ ఎలా పూర్తి చేశాడ‌న్న‌ది అంద‌రి మ‌దిని తొలిచేస్తోంది. దీనిపై సుజీత్ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. సినిమా మొద‌లు పెట్టాల‌నుకున్న‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ లేని స‌న్నివేశాల‌ని ముందుగా పూర్తి చేయాలని సుజీత్ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. అనుకున్న‌ట్టుగానే ప‌వ‌న్‌కు సంబంధం లేని స‌న్నివేశాల‌ని చ‌క చ‌క పూర్తి చేసి త‌న కోసం ఎదురు చూశాడ‌ట‌.

అంతే కాకుండా `ఓజీ`ని అనుకున్న స‌మ‌యానికి, అనుకున్న బ‌డ్జెట్‌లో పూర్తి చేయ‌డం కోసం సుజీత్ ఓ ఫార్ములాని ఫాలో అయ్యాడ‌ట‌. త‌ను చేసే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ని ప్ర‌త్యాన్మ‌య న‌టీన‌టుల‌తో పూర్తి చేయ‌డం సుజీత్‌కు అల‌వాటు. అలా చేయ‌డం వ‌ల్ల మేకింగ్‌కి టైమ్ త‌క్కువ ప‌డుతుంద‌ట‌. అదే ఫార్ములాను `ఓజీ` కోసం కూడా వాడాడ‌ట‌. `ఎందుకంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు బిజీ పొలిటీషియ‌న్‌. ఆయ‌న స‌మాయాన్ని వృధా చేయ‌కూడ‌ద‌ని భావించాను. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు ప్రాక్టిక‌ల్ సమ‌స్య‌ల్ని అంచ‌నా వేసి షూటింగ్ పూర్తి చేశాను` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గురించి కూడా సుజీత్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. ప్ర‌భాస్ పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ త‌న‌ని చాలా బాగా చూసుకున్నార‌ని, షూటింగ్ ఈజీగా జ‌ర‌గ‌డానికి స‌హ‌క‌రించార‌ని, త‌న‌ని అన్నా అని పిలిచేవాడిన‌ని, ప్ర‌భాస్ సెట్‌లో ఓ స్టార్‌గా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని, స్టార్ అయినా కానీ త‌న‌ది చాలా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం అని, త‌న‌తో సినిమా చేయ‌డం చాలా సుల‌భ‌మ‌ని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే `ఓజీ` షూటింగ్‌కు ముందు సుజీత్ డెమో షూట్‌ని వేరే న‌టీన‌టుల‌తో చేశాడ‌ట‌. ఆ ఫార్ములాని ప‌క్కాగా అమ‌లు చేయ‌డం వ‌ల్లే `ఓజీ` షూటింగ్ రాకెట్ స్పీడుతో పూర్త‌యింద‌ని తెలిసింది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు రాబ‌ట్టింది. ఈ ఏడాది విడుద‌లై అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో స్థానం ద‌క్కించుకుంది. ఈ ఏడాది టాప్ 10 ఇండియ‌న్ సినిమాల్లో నిలిచిన ఒకే ఒక్క తెలుగు సినిమాగా `ఓజీ` రికార్డు సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్‌ని చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి

Tags:    

Similar News