వార్ 2 టీజ‌ర్: హృతిక్‌తో ఎన్టీఆర్ ధూమ్మ‌ఛాలే!

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ టీజ‌ర్ ఏది? అంటే క‌చ్ఛితంగా అది `వార్ 2` కావొచ్చు.;

Update: 2025-05-20 06:26 GMT

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ టీజ‌ర్ ఏది? అంటే క‌చ్ఛితంగా అది `వార్ 2` కావొచ్చు. ఎందుకంటే ఇందులో ఆర్.ఆర్.ఆర్ న‌టుడు ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు గ‌నుక‌! ఆర్ఆర్ఆర్ నాటు నాటుతో భార‌త‌దేశానికి ఆస్కార్ తెచ్చిన నటుడి ఇన్వాల్వ్ మెంట్ య‌ష్ రాజ్ ఫిలింస్ `వార్ 2`కి గౌర‌వాన్ని పెంచింది. ప్ర‌స్తుతం ఉత్త‌రాది, ద‌క్షిణాది అనే తేడా లేకుండా స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతున్న ఏకైక సినిమా `వార్ 2` అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హృతిక్ రోష‌న్ ఫ్యాన్స్ తో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. అయితే అలాంటి వీరాభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ముందుంద‌ని తాజాగా రిలీజైన టీజ‌ర్ చెబుతోంది. ముందే అంచ‌నా వేసిన‌ట్టే టీజ‌ర్ లో యాక్ష‌న్ కంటెంట్ ప‌రాక‌ష్ట‌ను ఆవిష్క‌రిస్తోంది. నింగి నేల ఆకాశం కాదేదీ వార్ క‌న‌ర్హం! అన్న చందంగా హృతిక్, తార‌క్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ చెల‌రేగిపోయారు. ఆ ఇద్ద‌రూ ఒకరికొక‌రు ఎదురు ప‌డితే యుద్ధ భీభ‌త్సం ఎలా ఉంటుందో ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించార‌ని టీజ‌ర్ న‌మ్మకం పెంచింది.

వార్ 2 టీజ‌ర్ చూడ‌గానే ధూమ్ ఫ్రాంఛైజీ చిత్రాల‌కు ఇది ఎంత‌మాత్రం త‌గ్గ‌ద‌ని, మొన్నటికి మొన్న వ‌చ్చిన షారూఖ్ ప‌ఠాన్ లోని యాక్ష‌న్ కంటెంట్ కి మించి ఉంటుంద‌ని భరోసానిచ్చింది. హృతిక్ వ‌ర్సెస్ టైగ‌ర్ ష్రాఫ్ వార్ స‌న్నివేశాల్ని మించి, హృతిక్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని అయాన్ ముఖ‌ర్జీ వ‌ర్క‌వుట్ చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా రా ఏజెంట్, బెస్ట్ సోల్జ‌ర్ హృతిక్ రోష‌న్ ని ఢీకొట్టేవాడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుటైంది. ఎన్టీఆర్ వేష‌ధార‌ణ‌, లుక్, కాస్ట్యూమ్స ప్ర‌తిదీ ఎంతో అందంగా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాయి. తార‌క్ త‌న లుక్ కోసం ఎక్ట్స్ ట్రా ఎఫ‌ర్ట్ ఎందుకు పెడుతున్నాడో ఇప్పుడు వార్ 2 టీజ‌ర్ తో క్లారిటీ వ‌చ్చేసింది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో నువ్వా నేనా? అంటూ పోటీప‌డుతూ హృతిక్- ఎన్టీఆర్ సృష్టించిన భీభ‌త్సం నిజంగా ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇండియా బెస్ట్ సోల్జ‌ర్, రా ఏజెంట్ క‌బీర్ తో పోటీప‌డేవాడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసే వార్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. నీకు నేనెవ‌రో తెలీదు! అంటూ తార‌క్ ఇచ్చిన ఎంట్రీ అభిమానుల‌ను వెంటాడ‌టం ఖాయం.

వార్ 2 ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో క‌చ్ఛితంగా ఉంది. ఇది కూడా 1000 కోట్లు వ‌సూళ్లు తేగ‌ల‌దు అనే న‌మ్మ‌కం పెరిగింది. అయితే అయాన్ ముఖ‌ర్జీ టీజ‌ర్ ని ఎంత గ్రిప్పింగ్ గా ఆవిష్క‌రించారో అంత‌కుమించి ట్రైల‌ర్ తో హైప్ పెంచాల్సి ఉంది. టీజ‌ర్ , ట్రైల‌ర్ కంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాని ర‌క్తి క‌ట్టించాల్సి ఉంటుంది. హృతిక్ ని క్రిష్ ఫ్రాంఛైజీ, ధూమ్ 2లో చూసిన ప్రేక్ష‌కులు అంత‌కుమించి చూడాల‌నుకుంటారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని ఆర్.ఆర్.ఆర్ కొమ‌రం భీమ్ ని మించిన ఫోర్స్ తో చూడాల‌ని ఫ్యాన్స్ అనుకుంటారు. దానికి త‌గ్గ‌ట్టే సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేలా రూపొందించాడ‌ని భావిద్దాం. టీజ‌ర్ ఇన్ స్టంట్ హిట్. మ‌రి సినిమా ఏ రేంజులో ఉంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News