రెండేళ్ల‌వుతున్నా సీక్వెల్ అప్‌డేట్ లేదే!

ఈ సినిమాల‌ త‌రువాత ఆయ‌న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో భారీ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.;

Update: 2025-12-22 06:50 GMT

కేజీఎఫ్ సిరీస్ సినిమాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. ఈ సినిమాల‌ త‌రువాత ఆయ‌న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో భారీ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. 2023 డిసెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. కానీ `కేజీఎఫ్` స్థాయిలో అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ‌ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించ‌డం తెలిసిందే.

ఇత‌ర పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబు, శ్రియాయారెడ్డి, బాబీ సింహా, ఈశ్వ‌రీరావు, జాన్ విజ‌య్‌, టినూ ఆనంద్‌, దేవ‌రాజ్ న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.700 కోట్ల‌మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మూవీ విడుద‌లై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్త‌వుతున్నాయి. `స‌లార్‌` ఎండింగ్‌లో పార్ట్ 2 `సౌర్యాంగ‌ప‌ర్య‌` ఉంటుంద‌ని, అందులోనే అస‌లు కథ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

సినిమా విడుద‌లై రెండేళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ సీక్వెల్ గురించి చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. `స‌లార్‌` రెండేళ్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన చ‌ర్చ మ‌ళ్లీ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఫ్యాన్స్‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ సీక్వెల్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది?, దానికి సంబంధించిన అప్‌డేట్‌ని మేక‌ర్స్ ఎందుకు విడుద‌ల చేయ‌డం లేద‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మేక‌ర్స్ ఇప్ప‌టికైనా క్లారిటీ ఇస్తారేమోనే చ‌ర్చ ఫ్యాన్స్‌లో జ‌రుగుతోంది.

అయితే మేక‌ర్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రేజీ మూవీకి సీక్వెల్ ఎప్పుడు అనే చ‌ర్చ జ‌రుగుతుంటే మేక‌ర్స్ మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మారుతి డైరెక్ష‌న్‌లో `ది రాజా సాబ్‌`ని పూర్తి చేసి ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ప్ర‌భాస్ ..హ‌ను రాఘ‌వ‌పూడితో వార్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ `ఫౌజీ` చేస్తున్నాడు.

ఇది సెట్స్‌పై ఉండ‌గానే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ డైరెక్ష‌న్‌లో `స్పిరిట్`కు శ్రీ‌కారం చుట్టాడు. న‌వంబ‌ర్‌లో మెగాస్టార్ క్లాప్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ మూవీపై అంచ‌నాలు ఇప్ప‌టికే తారా స్థాయికి చేరుకున్నాయి. దీని త‌రువాత `క‌ల్కి 2898ఏడీ` సీక్వెల్ ప‌ట్టాలెక్క‌నుంది. ఇవి పూర్త‌యితే కానీ ప్ర‌భాస్ `స‌లార్‌` సీక్వెల్‌కు డేట్స్ కేటాయించ‌లేడు. అదీ కాకుండా ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో `డ్రాగ‌న్‌` మూవీని రూపొందిస్తున్నాడు. దీన్ని వ‌చ్చే ఏడాది జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇది పూర్త‌యితే కానీ ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` సీక్వెల్‌పై దృష్టి పెట్టే అవ‌కాశం లేదు. అంటే ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లని ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ పూర్తి చేస్తే గానీ `స‌లార్‌` సీక్వెల్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

Tags:    

Similar News