ఆది సాయి కుమార్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవ్వనున్న శంబాల..!
ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. సినీ, టెక్నికల్ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి తమ మద్దతును ప్రకటించారు.;
థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ విషయం పలు తెలుగు సినిమాల ద్వారా రుజువైంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఎంచుకొని మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందుకు వస్తుంది ‘శంబాల’.
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘శంబాల’ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. యుగంధర్ ముని దర్శకత్వంలో, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. సినీ, టెక్నికల్ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి తమ మద్దతును ప్రకటించారు. ఈ వేడుకలో పలువురు మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “‘శంబాల’పై ముందునుంచే మంచి పాజిటివ్ వైబ్ ఉంది. యుగంధర్ ముని చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సాయి కుమార్ గారు నాకు చేసిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆది అన్నని చూస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. డిసెంబర్ 25న ‘శంబాల’ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.
మంచు మనోజ్ తన మాటల్లో, “ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆది నిరంతరం కష్టపడే నటుడు. ఈ సినిమాతో అతడికి పెద్ద విజయం రావాలి” అని తెలిపారు.
హీరో ఆది సాయి కుమార్ భావోద్వేగంగా మాట్లాడుతూ, “ఈ ప్రయాణంలో మీడియా, ప్రేక్షకులు ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందన మాకు మరింత ధైర్యం ఇచ్చింది. దర్శకుడు, నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. థియేటర్లో ఈ సినిమాను చూస్తే సర్‌ప్రైజ్ అవుతారు. సాయి కుమార్ గారి కొడుకుగా పుట్టడం నా అదృష్టం. డిసెంబర్ 25న ‘శంబాల’తో హిట్టు కొట్టబోతున్నాం” అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఆది నాకు బ్రదర్ లాంటివాడు. ఎన్నో జానర్లలో ప్రయత్నం చేశాడు. ఈ సినిమాతో అతడికి మంచి సక్సెస్ రావాలి. సాయి కుమార్ గారి నిజాయితీ, మంచితనం చాలా అరుదైనవి. ‘శంబాల’ బ్లాక్ బస్టర్ అవ్వాలి” అని ఆకాంక్షించారు.
సాయి కుమార్ తన మాటల్లో, “మా సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో కొనసాగుతోంది. జయాపజయాలు సహజమే. కానీ ప్రయత్నం ఆపలేదు. ‘శంబాల’తో ఆదికి విజయం దక్కుతుంది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాతో నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “ఆది మంచి మనసున్న వ్యక్తి. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ ఈ సినిమాకు పెద్ద బలం. డిసెంబర్ 25న ‘శంబాల’ బ్లాక్ బస్టర్ కావాలి” అన్నారు.
ప్రియదర్శి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, “ట్రైలర్‌లో చూపించిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చివరి వరకు ఎంగేజ్ చేసే సినిమా ఇది. థియేటర్లోనే చూడాలి” అని చెప్పారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ, “నిర్మాతల నమ్మకమే ఈ సినిమాకు బలం. ఆది ఈ కథను నమ్మి మా వెంట నిలిచాడు. టెక్నికల్ టీం సహకారంతో సినిమాను బాగా తీశాం” అన్నారు.
మొత్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన మాటలన్నీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. డిసెంబర్ 25న విడుదలయ్యే ‘శంబాల’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోందన్న నమ్మకం చిత్ర బృందంలో కనిపించింది.