ఆ మూవీ రిలీజ్ అయి ఉంటే ఉదయ్ కిరణ్ బతికేవాడా ?

ఉదయ్ కిరణ్. నూనూగు మీసాల నూత్న యవ్వన దశలో వెండి తెరను తాకాడు.;

Update: 2026-02-19 03:31 GMT

ఉదయ్ కిరణ్. నూనూగు మీసాల నూత్న యవ్వన దశలో వెండి తెరను తాకాడు. బక్క పలచన కుర్రాడు, సినిమా ప్రపంచం గురించి ఏ మాత్రం అన్నెం పున్నెం తెలియని టీనేజ్ యువకుడు ఆ వెండి తెర మీద తాను కనిపిస్తాను అని కలలో కూడా అనుకోని ఉండడు. కానీ అదే వెండి తెరను నిండుగా ఆక్రమించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఆ ఏజ్ లో టాప్ హీరోల సినిమాలు చూస్తూ వారిలా ఊహించుకుంటూ కాలం వెళ్ళబుచ్చే పరిస్థితి. పైగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఉదయ్ కిరణ్ కి సైతం సినీ సీమ నిచ్చెన మెట్లు ఎక్కడం ఎలాగో అసలు తెలియదు. కానీ విధి విచిత్రమైనది. ఆయననే హీరో అంటూ తన తొలి సినిమాకు దర్శకుడు తేజా ఎంచుకోవడంతో ఉదయ్ కిరణ్ జీవితమే చిత్రంగా మారింది.

చిత్రంతో టాప్ స్టార్ :

లో బడ్జెట్ లో తీసిన చిత్రం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీ న్యూ మిలీనియం లోకి అడుగుపెడుతున్న సినిమా ప్రపంచానికి సరికొత్త దారులు చూపించింది. అప్పటి హీరోలు అంతా మిడిల్ ఏజ్ కి వచ్చేశారు కధలు రొటీన్ అవుతున్నాయి. ఆ సమయంలో ఫ్రెష్ ఫేస్ తో పక్కింటి అబ్బాయిగా ఉండే ఉదయ్ కిరణ్ హీరోగా ఒక అందమైన అమాయకమైన ప్రేమ కధ వెండి తెర బహు అందంగా పండింది. దాంతో ఉదయ్ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తరువాత నువ్వూ నేనూ. మనసంతా నువ్వే, కలుసుకోవాలని ఇలా వరస బెట్టి సినిమాలు హిట్లు కొడుతూ స్టార్ డం సాధించాడు. ఈ మధ్యలో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసి తన సరదా తీర్చుకున్నాడు. అక్కడ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అలా ఒక దశ సాగుతున్న తరుణంలో ఫేట్ తిరగబడింది.

దాదాపుగా షూటింగ్ పూర్తి :

ఈ క్రమంలో ఒక పెద్ద నిర్మాత. ఒక మంచి దర్శకుడు బహు భాషా చిత్రంగా అనుకుని ఉదయ్ కిరణ్ హీరోగా మూవీని స్టార్ట్ చేశారు. ఇందులో ఉదయ్ కిరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు. అయితే ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రద్దు అయ్యింది. జస్ట్ 20 శాతం పూర్తి చేస్తే ఈ మూవీ రిలీజ్ అయ్యేది మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆగిపోయింది. దాంతో స్టార్ డం పర్మనెంట్ చేస్తూ ఉదయ్ కిరణ్ ని మరో మెట్టు ఎక్కించే ఈ మూవీ ఆయన ఆశలను అడియాసలు చేసింది.

నిప్పులు చిమ్ముతూ :

మహా కవి శ్రీశ్రీ అన్నట్లుగా నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసి విజయాలను చింబించిన ఉదయ్ కిరణ్ అంతే తక్కువ సమయంలో పాతాళ కుహరాలను చూశారు. అలా ఎగిసిన నాడు ఆశ్చర్యంగా చూసిన వారే డౌన్ ఫాల్ తో ఉంటే అలాగే చూశారు. మూడు పదుల వయసులో ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న తన జీవితాన్ని ఆత్మహత్య తో ముగించాడు. ఆయన మంచి హిట్ కొట్టాలని తనతో మనసంతా నువ్వే వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్యను అడిగారుట. కానీ ఆ కోరిక తీరకుండానే దివికేగిపోయాడు. మొత్తానికి ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే మూవీకి పాతికేళ్ళు అయిన సందర్భంగా ఆయన గురించిన ముచ్చట్లు అంతా పంచుకుంటున్నారు. ఆయన సినీ జీవితాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News