8 నెలల్లో 35Kg బరువు పెరిగి... రెండు సార్లు హాట్‌ ఎటాక్‌

స్టార్‌ దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానంను కలిగి ఉన్న ఈయన బాలీవుడ్‌ పై అలిగి కొంత కాలంగా హిందీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.;

Update: 2026-02-19 05:23 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్ క‌శ్య‌ప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీలో ఎన్నో సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించి అభిరుచి ఉన్న ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన పలు అవార్డ్‌ విన్నింగ్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కొన్నాళ్ల ముందు వరకు అనురాగ్ క‌శ్య‌ప్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లు ఉండేది. కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా కూడా సినిమాలు ఉండేవి. అలాంటి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంపై ఆసక్తి తగ్గించి పూర్తిగా నటనపై శ్రద్ద కనబర్చుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన సౌత్‌ ఇండియన్‌ సినిమాలను సైతం చేస్తున్న విషయం తెల్సిందే. పలు తమిళ చిత్రాలను చేసిన ఈయన త్వరలో తెలుగు సినిమా డెకాయిట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌గా అనురాగ్ క‌శ్య‌ప్

స్టార్‌ దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానంను కలిగి ఉన్న ఈయన బాలీవుడ్‌ పై అలిగి కొంత కాలంగా హిందీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఉన్న ఒక వర్గం వారి రాజకీయం భరించలేక అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో స్వయంగా అనురాగ్ క‌శ్య‌ప్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో కంటే వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ షో ల్లో కనిపించేందుకు, వాటి మేకింగ్‌ కు ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నాడు. తాజాగా అనురాగ్ క‌శ్య‌ప్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు షాక్ ఇచ్చాయి. చాలా కాలంగా ఆయన తీవ్రమైన మానసిక సంక్షోభం ను ఎదుర్కొంటున్నాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్‌ సిరీస్‌...

ఆ ఇంటర్వ్యూలో అనురాగ్ క‌శ్య‌ప్ మాట్లాడుతూ.... నెట్‌ఫ్లిక్స్ కోసం నేను రాసిన ఒక కథ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్‌ విషయంలో నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఏడాదికి పైగా నేను ఆ ప్రాజెక్ట్‌ పై వర్క్ చేశాను. షూటింగ్‌ కు వెళ్లే ముందు ఆ స్క్రిప్ట్‌ ను వినాలని నెట్‌ఫ్లిక్స్ వారికి చెప్పాను. కానీ వారు పర్వాలేదు అని ప్రాజెక్ట్‌ ముందుకు తీసుకు వెళ్దాం అన్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆ ప్రాజెక్ట్‌ కోసం తాను పడ్డ ఏడాదిన్నర కష్టం వృదా అయింది. వారు మరో ప్రాజెక్ట్‌ ను ఇచ్చి దీనిపై వర్క్‌ చేద్దాం అని తాపీగా చెప్పారు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ నచ్చక పోవడంతో నేను టైం కావాలి అన్నాను. అలా నెట్‌ఫ్లిక్స్ వారి వల్ల చాలా మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తాను ఇచ్చిన ఒక షో ను మార్చి మరో షో మాదిరిగా చేద్దాం అని అన్నారని కూడా అనురాగ్ క‌శ్య‌ప్ చెప్పుకొచ్చాడు.

కొత్త జీవితం, కొత్త కెరీర్‌ పై దృష్టి

ఆ సమయంలో మానసికంగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా ఏకంగా రెండు సార్లు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అంతే కాకుండా ఆస్తమా ఎటాక్‌ అయ్యింది. దాంతో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వచ్చింది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారడంతో కేవలం 8 నెలల్లో ఏకంగా 35 కేజీల బరువు పెరిగి పోయాను. బరువు పెరుగుదల చూసి నా కూతురు షాక్‌ అయింది. వెంటనే నాపై ఒత్తిడి తీసుకు వచ్చి మరీ రిహాబిలేషన్ సెంటర్‌కి తరలించడం జరిగింది. కొన్నాళ్లకే కాలికి తీవ్రమైన గాయం అయింది. ఆ గాయం కారణంగా వీల్ చైర్ కి పరిమితం కావాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో నేను జీవితం విషయంలో ఆశలు వదులుకున్నాను అంటూ అనురాగ్ క‌శ్య‌ప్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే జీవితం మళ్లీ కొత్త అవకాశాలను ఇస్తుందనే విశ్వాసంతో నమ్మకంగా ఉన్నాను అని, మళ్లీ సినిమాల్లో బిజీ అవుతాను అనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయి. అవి వేరు వేరు దశల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ ఎక్కువగా యాక్టింగ్‌ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు అనురాగ్‌ కశ్యప్‌ తెలియజేశాడు.

Tags:    

Similar News