CBFC కత్తెర: కాజ‌ల్ సినిమాకి 20క‌ట్‌లు.. టాప్-10 సెన్సార్ పంచ్‌లు ఇవే!

మొత్తంగా `ది ఇండియా స్టోరీ` సినిమా నుండి 4 నిమిషాల 27 సెకన్ల నిడివి గల దృశ్యాలను CBFC డిలీట్ చేయించింది.

Update: 2026-07-24 01:30 GMT

నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సి) విధిస్తున్న ఆంక్షలు, కత్తెర్లు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్జీవీ, అనురాగ్ క‌శ్య‌ప్ లాంటి దిగ్గ‌జాలు ఇప్ప‌టికే సెన్సార్ క‌త్తెర‌ క్రియేటివిటీని చంపేస్తోంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. అస‌లు డిజిట‌ల్ యుగంలో సెన్సార్ తో ప‌నే లేద‌ని కూడా ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. అయినా సీబీఎఫ్‌సీకి ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో ప‌ని లేదు. క‌త్తెర వేయ‌డంలో య‌థేచ్ఛ‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. సెన్సార్ షిప్‌పై గ‌వ‌ర్న‌మెంట్ బాడీ ఉండాల్సిందేనా లేదా? అనే చ‌ర్చ అలా ఉంచితే.. తాజాగా శ్రేయాస్ తల్పడే-కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సామాజిక కోర్టురూమ్ డ్రామా `ది ఇండియా స్టోరీ` చిత్రానికి సెన్సార్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమాకి కేవలం 48 గంటల ముందు యుఏ 16+ సర్టిఫికేట్ మంజూరు చేసింది. అయితే అందుకోసం భారీ సవరణలు చేయాల్సి వచ్చింది. వ్యవసాయ సంక్షోభం, రసాయన పురుగుమందుల వాడకం- పంట‌ల సంబంధిత స్కామ్ ల నేప‌థ్యంలో సున్నితమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఏకంగా 20కి పైగా కట్స్, మార్పులను సెన్సార్ విధించింది.

ఈ సినిమాలో ముఖ్యంగా రాజకీయంగా, సామాజికంగా వివాదాస్పదంగా మారే అవకాశమున్న సంభాషణలపై సెన్సార్ బోర్డ్ కఠినంగా వ్యవహరించింది. `కిసాన్ ఆతంక్‌వాది` (రైతు ఉగ్రవాది), `సర్కార్ దేశ్‌ద్రోహి`(ప్రభుత్వం దేశద్రోహి) వంటి తీవ్రమైన మాటలను మార్చాలని ఆదేశించింది. అలాగే ద్వితీయార్ధంలో వచ్చే 1 నిమిషం 20 సెకన్ల నిడివి గల `కిసాన్ అపాడేత` సంభాషణను పూర్తిగా తొలగించింది. ఇవే కాకుండా కేరళలోని ఎండోసల్ఫాన్ విషాదం, తల్లుల పాలల్లో రసాయనాలు పెరిగి క్యాన్సర్‌కు దారితీసే అంశం, కల్తీ పాలు, భటిండా నుండి బికనేర్ వరకు నడిచే `క్యాన్సర్ ట్రెయిన్` ప్రస్తావనలు ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు తొలగింపు లేదా బ్ల‌ర్ చేసింది.

మొత్తంగా `ది ఇండియా స్టోరీ` సినిమా నుండి 4 నిమిషాల 27 సెకన్ల నిడివి గల దృశ్యాలను CBFC డిలీట్ చేయించింది. చిత్రం ప్రారంభంలో .. ముగింపులో సుదీర్ఘమైన డిస్‌క్లెయిమర్‌లను జోడించడం వల్ల 50 సెకన్ల నిడివి పెరిగినా తుది రన్‌టైమ్ 130.13 నిమిషాలుగా (2 గంటల 10 నిమిషాల 13 సెకన్లు) ఖరారైంది. ఈ భారీ కోతల వల్ల సినిమా చెప్పాలనుకున్న ప్రధాన సామాజిక సందేశం తీవ్రత ఎక్కడ తగ్గుతుందోనని చిత్రబృందం స‌హా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే చిత్ర పరిశ్రమలో సెన్సార్ బోర్డు రికార్డు స్థాయిలో కత్తెర వేయడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో `గ్రాండ్ మస్తీ` సినిమా ఏకంగా 218 కట్స్‌ను ఎదుర్కోగా, `మస్తీజాదే` (381 కట్స్), `క్యా కూల్ హై హమ్ 3` (150 కట్స్) వంటి చిత్రాలు తీవ్రమైన అడల్ట్, బోల్డ్ కంటెంట్ కారణంగా భారీగా సెన్సార్ కోతలకు గురయ్యాయి. బోల్డ్ వినోదాత్మక చిత్రాలకే కాకుండా సామాజిక, రాజకీయ కోణాలున్న ప్రాజెక్టులకు కూడా బోర్డు నుంచి ఈ తరహా నిబంధనలు ఎదురవుతూనే ఉన్నాయి.

చారిత్రక, రాజకీయ సున్నితత్వాలు ఉన్న చిత్రాల విషయంలోనూ సెన్సార్ షాక్‌లు తప్పలేదు. దిల్జీత్ దోసాంజ్ నటించిన మానవ హక్కుల చిత్రం `పంజాబ్ 95 ఏకంగా 120కి పైగా కట్స్‌ను ఎదుర్కోగా... `ఉడ్తా పంజాబ్` (89 కట్స్), `హాస్ బౌండ్` (41 కట్స్) చిత్రాలు తీవ్ర వివాదాలను దాటుకుని విడుదలయ్యాయి. అలాగే దక్షిణాదిలో దళపతి విజయ్ `జన నాయిగన్` (27 కట్స్), శివకార్తికేయన్ `పరాశక్తి` (25 కట్స్) వంటి సినిమాలు కూడా సెన్సార్ నిబంధనలను పూర్తి చేసుకునే థియేటర్లలోకి వచ్చాయి. సృజనాత్మక స్వేచ్ఛకు, సమాజ సున్నితత్వానికి మధ్య సెన్సార్ బోర్డు వేస్తున్న ఈ కత్తెర్లు నిరంతర చర్చగా నిలుస్తున్నాయి.

Tags:    

Similar News