'ది ఒడిస్సీ'ని మ‌హాభార‌తంతో పోల్చిన ఆషీకారంగ‌నాధ్!

ఈ సినిమాలోని కొన్ని కీలక అంశాలు మన పురాణాలైన మహాభారతాన్ని తలపించేలా ఉన్నాయని ఆషీకా అభిప్రాయపడ్డారు.

Update: 2026-07-23 18:30 GMT

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెర‌కెక్కించిన `ది ఒడిస్సి` వ‌ర‌ల్డ్ వైడ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌త్ లోనూ సినిమాకు అసాధార‌ణ‌మైన ఫాలోయింగ్ ద‌క్కుతోంది. రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన జ‌నాలంతా ఒడిస్సీ వైపు మ‌ళ్లుతున్నారు. `అవ‌తార్` త‌ర్వాత ఆ రేంజ్ సినిమా లేక‌పోవ‌డంతో? ఒడిస్సికి ప్రేక్ష‌కులంతా ప‌ట్టం క‌డుతున్నారు. సినిమా లో శాస్త్రీయత, మానసిక భావోద్వేగాలు , విజువల్ వండర్స్‌ ఎంత‌గానో ఆక‌ట్టుకుం టున్నాయి. తాజాగా ఈసినిమా గురించి టాలెంటెడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ సినిమాలోని కొన్ని కీలక అంశాలు మన పురాణాలైన మహాభారతాన్ని తలపించేలా ఉన్నాయని ఆషీకా అభిప్రాయపడ్డారు. క్రిస్టోఫర్ నోలన్ కథా శైలి , ఆయన ఎంచుకున్న‌ దృశ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. `ది ఒడిస్సీ` చిత్రానికి సంబంధించిన విశేషాలను పరిశీలిస్తు న్నప్పుడు అందులోని సంఘర్షణలు, పాత్రల ప్రయాణం అచ్చం మన భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని ఘట్టాలను గుర్తుచేశాయని వెల్లడించారు. పశ్చిమ దేశాల పురాణ గాథ అయినప్పటికీ అందులో లోతైన భావోద్వేగాలు.. సత్యాలను పోలి ఉన్నాయ‌న్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కథలన్నీ మానవ స్వభావం, ధర్మం, పోరాటం చుట్టూనే తిరుగుతాయని చెప్పడానికి ఈ పోలిక ఉదాహరణగా నిలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కిన‌ ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లు భారతీయ సాంస్కృతిక ఇతిహాసాలతో ఎంతగా కనెక్ట్ అయి ఉంటాయో ఈ వ్యాఖ్యలు మ‌రోసారి స్పష్టం చేస్తున్నాయి. ఆషికా రంగనాథ్ చేసిన కామెంట్స్ చర్చకే ప‌రిమితం కాలేదు. ఈస్ట్ .. వెస్ట్ కల్చర్స్ మధ్య ఉన్న కథా పరమైన సారూప్యతలను బయటపెట్టాయి. ఏ దేశంలో పుట్టిన కథ అయినా? మూలాలు , నైతిక విలువలు ఒకేలా ఉంటాయని చెప్పడానికి ఇది నిదర్శనమని మ‌రోసారి తేట తెల్ల‌మ‌వుతోంది.

`అవ‌తార్` కాన్సెప్ట్ కూడా భార‌త్ మూలాల నుంచి తీసుకున్న‌దే. ఆసినిమాలో పాండోరా ప్రపంచం, నావి జాతి జీవన విధానం, ప్రకృతితో వారికున్న విడదీయరాని అనుబంధం ఇవన్నీ అచ్చమైన భారతీయ సంస్కృతికి, హిందూ పురాణాలకు అద్దం పడుతున్నట్లుగా ఉంటుందనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పలు కీలక అంశాలు భార‌త‌ దేశపు ప్రాచీన మూలాలను గుర్తు చేస్తుంటాయి. సినిమాలో మానవులు నీలం రంగులో చూపించే నావి జాతి పాత్రలు, వాటి రూపురేఖలు హిందూ పురాణాల్లోని దైవిక రూపాలను పోలి ఉంటాయి.

హిందూ ధర్మంలో మహావిష్ణువు అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దైవిక శక్తులు నీలం రంగు లో వర్ణించబడ్డాయి. అచ్చం అలాగే అవతార్ చిత్రంలోని జీవులకు కూడా నీలం రంగు లో క‌నిపించ‌డం.. వాటిని ప్రకృతి రక్షకులుగా చూపించడం గమనించదగ్గ విషయం. అంతేకాదు సంస్కృత పదమైన అవతారం అనే పదాన్ని నేరుగా ఈ చిత్రానికి శీర్షికగా వాడటం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. సినిమాలో చూపించిన ప్రకృతి ఆరాధన విధానం భారతీయ సనాతన ధర్మానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. చెట్లను, అడవులను, జీవరాశు లన్నింటినీ దైవంగా భావించి పూజించడం, ప్రకృతికి హాని తలపెట్టకుండా మమేకమై జీవించడం మన సంప్రదాయం. ఇదంతా అవ‌తార్ లో చూసిందే క‌దా.

Tags:    

Similar News