ఈ సినిమాను కూడా ఆకాశానికెత్తేస్తే ఎలా?

ఆ దశలో తమిళ విమర్శకులు కూడా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకు మద్దతుగా నిలుస్తూ.. రొటీన్ సినిమాలను తెగనాడేవాళ్లు.

Update: 2026-07-23 19:30 GMT

ఒకప్పుడు తమిళ సినిమా వైపు దేశమంతా ఆశ్చర్యపోయి చూసేది. అక్కడి నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చేవి. మణిరత్నం, శంకర్, మురుగదాస్ లాంటి మేటి దర్శకులే కాదు.. యంగ్ డైరెక్టర్లు కూడా సరికొత్త సినిమాలను డెలివర్ చేసేవాళ్లు. అక్కడ జరిగినన్ని ప్రయోగాలు ఇండియాలో మరే ఫిలిం ఇండస్ట్రీలోనూ జరిగేవంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులు మన చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఎక్కువ ఆసక్తి చూపించేవారన్నది వాస్తవం.

ఆ దశలో తమిళ విమర్శకులు కూడా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకు మద్దతుగా నిలుస్తూ.. రొటీన్ సినిమాలను తెగనాడేవాళ్లు. చాలా క్రిటికల్‌గా రివ్యూలు ఇచ్చేవాళ్లు. వికటన్ అనే మ్యాగజైన్‌లో గొప్ప గొప్ప సినిమాలకు కూడా వందకు 60 లోపే మార్కులు పడేవి. అందులో 50 మార్కులు తెచ్చుకోవడం కూడా గొప్ప ఘనతగా భావించేవాళ్లు. తమిళ క్రిటిక్స్‌ అలాంటి ప్రమాణాలు పాటించేవారు అప్పట్లో.

కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళ సినిమాల క్వాలిటీనే కాదు.. క్రిటిక్స్ ప్రమాణాలు కూుడా పూర్తిగా పడిపోయాయి. ఏమాత్రం బాాగాలేని సినిమాలను కూడా ఆహా ఓహో అంటూ కొనియాడేస్తున్నారు. ఇక స్టార్ హీరోలు నటించిన సినిమాలనైతే మామూలుగా పొగడరు అక్కడి క్రిటిక్స్. ఇప్పుడంతా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లదే రాజ్యం. యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రివ్యూలు ఇచ్చేవాళ్లు పెరిగిపోయారు. ఏదైనా స్టార్ సినిమా వచ్చిందంటే చాలు అందరిదీ ఒకటే భజన. ముఖ్యంగా విజయ్ సినిమా అంటే నెగెటివ్ రివ్యూలన్నవే కనిపించవు.

విజయ్ నుంచి గత కొన్నేళ్లలో ది గోట్, లియో, వారిసు లాంటి సబ్ స్టాండర్డ్ మూవీస్ అందించాడు. కానీ వాటన్నింటినీ తమిళ క్రిటిక్స్ 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చి కొనియాడిన వాళ్లే. ఇప్పుడు విజయ్ నుంచి ‘జననాయగన్’ సినిమా వచ్చింది. విజయ్ రాజకీయ ప్రయోజనం కోసం కావాల్సిన మసాలా అంతా పులిమి ‘భగవంత్ కేసరి’ని పూర్తిగా పాడు చేసేశారు. విజయ్ చివరి చిత్రం కదా అని థియేటర్లకు వెళ్లిన వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. మూడు గంటల పాటు ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది చిత్ర బృందం.

ఇందులో విలన్ ట్రాక్.. పొలిటికల్ టచ్ ఉన్న సీన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ట్రాక్స్ అన్నీ కూడా చాలా పేలవంగా తయారయ్యాయి. మరీ ఇంత క్రింజ్‌గా ఎలా తీశారు అనిపించేలా ఉన్నా ఆ సీన్లన్నీ. కానీ ఇలాంటి సినిమాకు కూడా తమిళ క్రిటిక్స్ 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చేశారు. ఎంత విజయ్ సీఎం అయినా, ఆయనకిది చివరి చిత్రం అయినా సరే.. బాలేని సినిమాను సూపర్ అని పొగిడేయడం విడ్డూరం. మన దగ్గర కూడా స్టార్ల సినిమాలకు సమీక్షల్లో కాస్త గ్రేస్ మార్కులు పడుతుంటాయి కానీ.. మరీ ఇలా బాలేని సినిమాను సూపర్ అంటూ నెత్తిన పెట్టుకోవడం ఉండదు.

Tags:    

Similar News