ఈ దృశ్యం చూసి 'జై బాబు- జై బండ్ల' అంటూ ఫ్యాన్స్ ర‌చ్చ‌!

ఈ వివాహ వేడుక కోసం బండ్ల గణేష్ స్వయంగా వెళ్లి సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీమతి నమ్రత శిరోద్కర్ జంటను ఆప్యాయంగా ఆహ్వానించారు.

Update: 2026-07-23 18:25 GMT

నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. తన కుమార్తె జనని వివాహ వేడుకను ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ శుభకార్యానికి సంబంధించి ఇప్పటికే వివాహ పత్రికల పంపిణీ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో `#జ‌న‌ని సూర్య‌ప్ర‌ణామ్` అనే హాష్‌ట్యాగ్‌తో బండ్ల గణేష్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

ఈ వివాహ వేడుక కోసం బండ్ల గణేష్ స్వయంగా వెళ్లి సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీమతి నమ్రత శిరోద్కర్ జంటను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ ఆద‌ర్శ జంట‌తో విలువైన స‌మ‌యం గ‌డిపిన బండ్ల వారి ఆద‌రాభిమానాల‌ను మ‌ర్చిపోలేనని అన్నారు. మ‌హేష్ విన‌యం, ఆత్మీయ‌త‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసిస్తూ.. త‌న కుటుంబ యోగ క్షేమాల‌ను మ‌హేష్ బాబు అడిగార‌ని తెలిపారు. ముఖ్యంగా ఎంత‌గా ఎదిగినా మహేష్ బాబు సింప్లిసిటీ, మానవత్వం హృదయాన్ని హత్తుకున్నాయని తెలిపారు.

 

బండ్ల గణేష్ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించారు. ముఖ్యంగా ఫోటోలో మహేష్ బాబు కొత్త లుక్ ఎంతో అద్భుతంగా ఉందంటూ `అంబానీ వెడ్డింగ్ లుక్‌ని బీట్ చేస్తున్నారు` అని ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపించారు. `జై బాబు` అనే నినాదాలతో కామెంట్ సెక్షన్ నిండిపోగా, ఒక అభిమాని ఏకంగా ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో `జై బాబు` అని టైప్ చేసి తన అభిమానాన్ని చాటుకోవడం విశేషం. జై బాబు లానే కొంద‌రు జై బండ్ల అని కూడా కామెంట్ చేస్తున్నారు.

ఈ పెళ్లి ఆహ్వానాల పర్వంలో కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా... టాలీవుడ్‌లోని అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఇండస్ట్రీలోని దాదాపు టాప్ 50 సెలబ్రిటీలు బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్నారు. ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉన్న బండ్ల గణేష్.. ప్రతి ఒక్కరినీ స్వయంగా కలిసి ఆహ్వానిస్తుండటంతో ఈ వేడుకపై అందరి దృష్టి నెలకొంది.

తెలుగు చిత్రసీమకు చెందిన దిగ్గజ నటులు, టాప్ స్టార్స్, నిర్మాతలు, దర్శకులందరూ ఒకే వేదికపైకి రాబోతుండటంతో ఈ పెళ్లి వేడుక కన్నుల పండువగా మారనుంది. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర తారలంతా ఒకే చోట హాజరైతే ఆ కల్యాణ వేదిక కళే వేరుగా ఉంటుందని.. ఇది టాలీవుడ్‌లో మరో అరుదైన వేడుకగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News