అజిత్ విజయ్ హగ్.. మహేష్, పవన్‌లకు ఎందుకు కుదరట్లేదు?

విజయ్, అజిత్ సిల్వర్‌స్టోన్‌లో కలుసుకున్న వీడియో ఇప్పుడు సౌత్‌లో వైరల్ అవుతోంది.

Update: 2026-09-13 05:00 GMT

విజయ్, అజిత్ సిల్వర్‌స్టోన్‌లో కలుసుకున్న వీడియో ఇప్పుడు సౌత్‌లో వైరల్ అవుతోంది. ఎన్నేళ్లుగా అభిమానులు ప్రత్యర్థులుగా చూసే ఇద్దరు స్టార్లు ఎదురెదురుగా వచ్చి హగ్ చేసుకోవడం తమిళ అభిమానులకు స్పెషల్ మూమెంట్ అయింది. ఆ వీడియో తర్వాత తెలుగులో కూడా పవన్ కల్యాణ్, మహేష్ బాబు పేర్లు కలిసి ట్రెండ్ అయ్యాయి. ఇద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో ఎప్పుడు కనిపిస్తారనే పోస్టులు సోషల్ మీడియాలో పెరిగాయి.

పవన్, మహేష్ పేర్లు ఇలా కలవడం కొత్త విషయం కాదు. 2008లో వచ్చిన ‘జల్సా’లో పవన్ పాత్రను పరిచయం చేసే వాయిస్ ఓవర్ మహేష్ చెప్పారు. సంజయ్ సాహు ఎంట్రీకి ముందే మహేష్ గొంతు వినిపించడం అప్పట్లో సినిమాకు హైలెట్. మహేష్ ఈ వాయిస్ ఓవర్‌కు రెమ్యునరేషన్ తీసుకోలేదని అప్పటి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. పవన్ కూడా మహేష్ కెరీర్ ప్రారంభ దశలో ‘యువరాజు’ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లారు.

అయితే కెమెరా ముందు ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. పవన్ మొదటి నుంచీ సినిమా వేడుకలకు తరచుగా వెళ్లరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన షెడ్యూల్ మరింత మారిపోయింది. మహేష్ కూడా ఇతర హీరోల సినిమా కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా కనిపించరు. ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, అవార్డు వేడుకల్లో కూడా వీరిద్దరూ ఒకేసారి కనిపించడం అరుదుగానే జరిగింది.

2014లో హుద్‌హుద్ బాధితుల కోసం టాలీవుడ్ నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమానికి పవన్, మహేష్ ఇద్దరూ వస్తారనే ప్రచారం జరిగింది. నవంబర్ 30న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఆ కార్యక్రమానికి చివరకు ఇద్దరూ హాజరుకాలేదు. తర్వాత కూడా కొన్ని సినిమా వేడుకల సమయంలో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారని టాక్స్ వినిపించాయి. అభిమానులు ఎదురు చూసిన ఆ ఫొటో మాత్రం ఇప్పటివరకు రాలేదు.

ఇద్దరూ ఒకే వేదికపై కనిపించకపోయినా, ఒకరి సినిమాపై మరొకరు స్పందించిన సందర్భాలు మాత్రం ఉన్నాయి. ‘వకీల్ సాబ్’ విడుదలైనప్పుడు మహేష్ సినిమా చూసి పవన్ నటనను మెచ్చుకున్నారు. మరోవైపు ‘మేజర్’ సినిమా గురించి పవన్ మాట్లాడేటప్పుడు నిర్మాతగా మహేష్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఇలా సినిమాల విషయంలో ఒకరిపై మరొకరు పాజిటివ్‌గా మాట్లాడిన సందర్భాలు మధ్య మధ్యలో వచ్చాయి.

ఎన్నికల్లో పవన్ గెలిచినప్పుడు కూడా మహేష్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అప్పట్లో కూడా ఇద్దరి పేర్లు ట్రెండ్ అయ్యాయి. అయితే అభిమానులు ఎదురు చూస్తున్నది మాత్రం మాటల్లో కనెక్షన్ కాదు, ఇద్దరూ ఒకే చోట కలిసి కనిపించే ఆ ఒక్క మూమెంట్. విజయ్ అజిత్ హగ్ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ మహేష్ ఫ్రేమ్ కోసం ఎదురుచూపులు మళ్లీ మొదలయ్యాయి.




Tags:    

Similar News