గో లోకల్ టూ గ్లోబల్: మూలాలకే ప్రాధాన్యమిస్తున్న నేటి తరం మేకర్స్!
చలన చిత్రసీమలో అత్యంత వేగంగా మారుతున్న అంశం సినిమాల స్కేల్ .. కథన విధానం. ఒకప్పుడు కథ ప్రాంతీయ పరిధికి పరిమితమైతే.. నేడు సరిహద్దులు దాటి ప్రపంచస్థాయికి చేరుతోంది.
చలన చిత్రసీమలో అత్యంత వేగంగా మారుతున్న అంశం సినిమాల స్కేల్ .. కథన విధానం. ఒకప్పుడు కథ ప్రాంతీయ పరిధికి పరిమితమైతే.. నేడు సరిహద్దులు దాటి ప్రపంచస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో పాన్-ఇండియా వర్సెస్ రీజనల్ సినిమా అనే అంశంపై నవతరం దర్శకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తతరం మేకర్స్ బడ్జెట్ ఆధారంగా కాకుండా కథ మూలాలు ఆధారంగానే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నారు.
నవతరం దర్శకులు ప్రధానంగా నమ్ముతున్న సిద్ధాంతం గో లోకల్ టూ గ్లోబల్ అనే దాన్ని బలంగా నమ్ముతున్నారు. కథ ఏ ప్రాంతానికి చెందినదైనా? అందులోని భావోద్వేగాలు సహజంగా ఉంటే అది భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. రూట్డ్ నేటివిటీతో కూడిన రా అండ్ రస్టిక్ కథలను తెరకెక్కించడంపైనే యువ దర్శకులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.
అయితే ప్రతి కథనూ బలవంతంగా పాన్-ఇండియా సినిమాగా మార్చాలనే ఆలోచనను నవతరం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారీ బడ్జెట్, వేర్వేరు పరిశ్రమల నుంచి నటులను తీసుకోవడం, పది భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల ఒక సినిమా పాన్-ఇండియా అవ్వదని భావిస్తున్నారు. కథలో విశ్వజనీనమైన ఎమోషన్ లేదా లార్జర్ దన్ లైఫ్ అంశం ఉన్నప్పుడే పాన్-ఇండియా స్థాయి ఇవ్వాలని కాని పక్షంలో సహజమైన రీజనల్ సినిమాగానే నిర్మించడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
ఇక రీజనల్ సినిమాల విషయానికి వస్తే పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కే ప్రాంతీయ చిత్రాలు నవతరం దర్శకులకు ప్రయోగశాలలా మారుతున్నాయి. భావోద్వేగాలు, డిఫరెంట్ జానర్లు, కథానాయకుడి ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులను ఎలాంటి ఆంక్షలు లేకుండా రీజనల్ స్థాయిలో రూపొందిస్తున్నారు. తక్కువ రిస్క్‌తో కొత్త ప్రయోగాలు చేయడానికి రీజనల్ ఫార్మాట్ అద్భుతమైన అవకాశం ఇస్తోందని భావిస్తున్నారు.
మరోవైపు బిజినెస్ మోడల్‌పై కూడా యువ దర్శకులకు స్పష్టమైన అవగాహన ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాక రీజనల్ సినిమాగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు కూడా డిజిటల్ మాధ్యమంలో పాన్-ఇండియా స్థాయి వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఆర్భాటం చేయడం కంటే? కంటెంట్‌పై దృష్టి పెడితే ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల్లోకి చేరుతుందనేది నేటి మేకర్స్ విశ్వాసం.
నవతరం దర్శకులు పాన్-ఇండియా లేదా రీజనల్ అనే లేబుల్స్ కంటే కథలో ఉండే నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా సైజు ఏదైనా? ప్రేక్షకుడు థియేటర్‌లో పొందే అనుభూతి ప్రాథమికమైనదని నమ్మి సాంకేతికతను, ప్రాంతీయ మూలాలను సమర్థవంతంగా మేళవించి భారతీయ సినిమాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నారు.