రామాయణ ప్రమోషన్ల సైలెన్స్ - బిజినెస్ డౌట్స్!
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న`రామాయణ` సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది.
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న`రామాయణ` సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో 60 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ పాటిస్తున్న నిశ్శబ్దం సినీ వర్గాల్లో - అభిమానుల్లో అనేక అనుమానాలకు, చర్చలకు దారితీస్తోంది. సాధారణంగా వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే భారీ చిత్రాలకు నెలల ముందు నుంచే ప్రమోషన్ల హడావుడి మొదలవుతుంది. కానీ రామాయణ టీమ్ మాత్రం సైలెంట్‌గా ఉండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ మార్కెట్ ఆశిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కేవలం ట్రైలర్ లాంచ్‌తో సరిపెట్టుకుని తదుపరి పబ్లిసిటీ కార్యక్రమాలను హోల్డ్‌లో పెట్టారని సమాచారం. సాధారణంగా ఈ స్థాయి విజువల్ వండర్ మూవీకి ప్రమోషన్స్ కోసం విస్తృతమైన ప్లాన్స్ ఉంటాయి. కానీ మేకర్స్ పబ్లిసిటీ ఊపు పెంచకపోవడం వెనుక బిజినెస్ సమీకరణాలు , పర్ఫెక్ట్ టైమింగ్ ప్లానింగ్ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల విడుదలైన యష్ `టాక్సిక్` సినిమా ఫలితం కూడా `రామాయణ` ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై కొంత ప్రభావం చూపిందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. రామాయణ చిత్రంలో యష్ అత్యంత కీలకమైన రావణుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్` సిరీస్ తర్వాత యష్ ప్రాజెక్టులపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడటంతో టాక్సిక్ ఫలితం ఈ సినిమా బిజినెస్ క్రేజ్‌పై కొంత వరకు మార్పు తీసుకువచ్చిందని దీంతో ట్రేడ్ వర్గాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో రామాయణ ప్రొడక్షన్ టీమ్ ఏమాత్రం తొందర పడకుండా సరైన సమయం కోసం వేచి చూసే వ్యూహాన్ని అమలు చేస్తోందని తెలుస్తోంది. సరైన ప్లానింగ్‌తో ఒక్కసారిగా ప్రమోషన్ల హోరెత్తిస్తే సినిమాపై అంచనాలు మళ్లీ రెట్టింపు అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. ప్రమోషన్ ఆలస్యమైనా? వీక్షకులలో ఆసక్తిని పెంచే విధంగా తదుపరి కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
రణబీర్ కపూర్ - సాయి పల్లవి- యష్ కాంబినేషన్ సినిమాకు అతిపెద్ద బలంగా నిలవనుంది. వీరి స్టార్ పవర్ కలగలిస్తే పాన్-ఇండియా వ్యాప్తంగా ..ఓవర్సీస్‌లో అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో యష్ నటన, శ్రీరాముడిగా రణబీర్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని దాంతో టాక్సిక్ ప్రభావాన్ని చెరిపివేసి సినిమా మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తుందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. ఈ రెండు నెలల వ్యవధిని మేకర్స్ ఏ విధంగా ఉపయోగించుకుంటారు? బిజినెస్ పరంగా మళ్లీ ఊపు ఎలా తెస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగి భారీ ప్రమోషన్లతో రామాయణ మేకర్స్ సందడి చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.