పొర‌పాట్లు..మ‌న‌స్ప‌ర్ద‌ల‌తో పెళ్లి పీట‌లెక్క‌ని జోడీ !

90వ దశకంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వార్తల్లో నిలిచిన ప్రేమ జంటల్లో అక్షయ్ కుమార్, శిల్పా శెట్టిల జోడీ ఒకటి.

Update: 2026-09-07 02:18 GMT

90వ దశకంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వార్తల్లో నిలిచిన ప్రేమ జంటల్లో అక్షయ్ కుమార్, శిల్పా శెట్టిల జోడీ ఒకటి. తెరపై ఇద్ద‌రి కెమిస్ట్రీ ఎంతగా పండిందో? తెర వెనుక ప్రేమాయణం కూడా అంతే సంచలనంగా మారింది. ఎంత గానో ప్రేమించుకున్న జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టలేకపోయారు. వీరి సంబంధం, పెళ్లి దాకా వచ్చి ఎందుకు నిలిచిపోయిందనే విషయాలపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సునీల్ దర్శన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర నిజాలను వెల్లడించారు.

అక్షయ్ కుమార్ కెరీర్ ప్లాప్‌లతో సంక్షోభంలో ఉన్న సమయంలో `జాన్వర్` చిత్రానికి సునీల్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో అక్షయ్, శిల్పాలు ఎంతటి బలమైన బంధంలో ఉన్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఇద్ద‌రు పెళ్లి పీటలు ఎక్కడం దాదాపు ఖాయమని అంతా భావించారని తెలిపారు. `నా కళ్ల ముందే వారి ప్రేమాయణం సాగింది. నిజానికి వారు వివాహం చేసుకుంటారని.. పెళ్లికి సర్వం సిద్ధమవుతోందని నేను బలంగా నమ్మాను` అని సునీల్ దర్శన్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ ప్రేమకథ అనుకోని మలుపులు తిరిగింది. ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత మనస్పర్థలు బంధాన్ని శాశ్వతంగా దెబ్బతీశాయి. పరస్పరం అర్థం చేసుకునే క్రమంలో వచ్చిన విభేదాలు చివరకు ఇద్దరూ విడిపోవడానికి కారణమయ్యాయి. మనస్పర్థల తీవ్రత పెరగడంతో పెళ్లి పీటల దాకా వెళ్లాల్సిన జంట పరస్పర సమ్మతితో సంబంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని దర్శకుడు గుర్తు చేసుకున్నారు.

ప్రేమ వ్యవహారం విక‌టించినా? వృత్తిపరంగా వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. సునీల్ దర్శన్ దర్శకత్వంలో వచ్చిన `జాన్వర్` (1999) చిత్రం అక్షయ్ కుమార్‌కు కంబ్యాక్ మూవీగా నిలిచింది. వరుస ప్లాప్‌లతో ఉన్న అక్షయ్ కెరీర్‌ను ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కించింది. ఆ తర్వాత వచ్చిన `ధడకన్` చిత్రం కూడా భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోవడంతో పాటు ఇద్ద‌రి నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత కాలంలో ఇద్దరి దారులు వేరయ్యాయి. అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకోగా, శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడి జీవితాల్లో స్థిరపడ్డారు. కాలక్రమేణా ఇద్ద‌రు పాత చేదు జ్ఞాపకాలను పక్కన బెట్టి వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకునే స్థాయికి చేరుకున్నారు. వివిధ సినీ వేదికలపై ఒకరికొకరు ఎదురై నప్పుడు ఎంతో గౌరవంగా పలకరించుకోవడం చూడ ముచ్చ‌టగా ఉంటుంది.

బాలీవుడ్ చరిత్రలో ఎంతో మంది నటుల ప్రేమకథలు పెళ్లి దాకా వెళ్లి విఫలమయ్యాయి. వాటి గురించి జ‌నాలు మ‌ర్చి పోయారు. కానీ అక్షయ్ కుమార్ - శిల్పా శెట్టిల బంధం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల్లో చ‌ర్చ జ‌రుగుతుంటుంది. సునీల్ దర్శన్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు నాటి తీపి-చేదు జ్ఞాపకాలను విధి ఆడిన వింత‌ నాటకం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News