బాలీవుడ్ దివాలా ఆలోచ‌న‌ల‌పై సీనియ‌ర్ న‌టుడు

బాలీవుడ్ సౌత్ సినిమాల‌కు రీమేక్‌లు, ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమాలు తీసేందుకు ఉవ్విళ్లూరుతోంది.;

Update: 2025-05-07 03:00 GMT

బాలీవుడ్ సౌత్ సినిమాల‌కు రీమేక్‌లు, ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమాలు తీసేందుకు ఉవ్విళ్లూరుతోంది. సౌత్ తో పోటీప‌డుతూ 500-1000 కోట్ల మ‌ధ్య వ‌సూళ్ల‌ను సాధించే సినిమాలు తీయాల‌ని ఆరాట‌ప‌డుతోంది. దీని ప‌ర్య‌వ‌సానం దారుణ వైఫ‌ల్యాల‌ను చ‌వి చూస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు సీనియ‌ర్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖి. బాలీవుడ్ లో ఒరిజిన‌ల్ స్క్రిప్టుల‌తో కొత్త క‌థ‌ల‌తో సినిమాలు తీయ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డం లేద‌ని, రీమేకుల‌తో సేఫ్ గేమ్ ఆడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

హిందీ చిత్ర‌సీమ‌లో సృజ‌నాత్మ‌క‌త దిగ‌జారింద‌ని న‌వాజుద్దీన్ అన్నారు. బాలీవుడ్ రిపీటెడ్ సినిమాలు తీసే చ‌క్రంలో చిక్కుకుంద‌ని, కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేసేందుకు, రిస్కులు తీసుకునేందుకు సిద్ధంగా లేద‌ని, గ‌తంలో ప‌ని చేసిన సూత్రాల‌కు అతుక్కుపోతోంద‌ని అత‌డు అన్నారు. ఈ సృజనాత్మక స్తబ్దత, పరిశ్రమలో పెరుగుతున్న అభద్రత నుండి పుట్టిందని విశ్లేషించారు. ఫిలింమేక‌ర్స్ ఆలోచనలను రీసైక్లింగ్ చేయడం, అంతూ ద‌రీ లేని సీక్వెల్‌లను తయారు చేయడంపై దృష్టి సారించారు. కొత్త కంటెంట్ పై దృష్టి పెట్ట‌డం కంటే, పాత హిట్ చిత్రాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని సౌక‌ర్య‌వంతంగా భావిస్తున్నారని అన్నారు. దీనిని `సృజ‌నాత్మ‌క దివాలా` అని విమ‌ర్శించారు.

`గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` లాంటి ఒరిజిన‌ల్ కంటెంట్ ని సృష్టించిన అనురాగ్ క‌శ్య‌ప్ బాలీవుడ్ వ‌దిలి దూరంగా వెళ్ల‌డంపైనా నవాజుద్దీన్ మాట్లాడారు. అత‌డు ముంబై నుంచి మ‌కాం మార్చాన‌ని స్పష్టం చేశారు. తరువాత సౌత్ లో ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పాడు. కానీ పరిశ్రమ నుండి వెళ్లిపోవ‌డానికి కార‌ణం.. ఇక్క‌డ‌ పెరుగుతున్న విషపూరిత వాతావరణం ప్ర‌ధాన‌ పాత్ర పోషించిందని ఒప్పుకున్నాడు. వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఒరిజిన‌ల్ సినిమా స్ఫూర్తిని నాశ‌నం చేసార‌ని కూడా అనురాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడ‌ని న‌వాజుద్దీన్ అన్నాడు. బాక్సాఫీస్ టార్గెట్స్ పెట్టుకుని ఛేధించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో బాలీవుడ్ కింద ప‌డింద‌ని అన్నారు. క్రియేటివిటీ లేక‌పోవ‌డంతో క‌ళాకారుల‌ను కిందికి ప‌డిపోయార‌ని ఆవేద‌న చెందారు.

Tags:    

Similar News