ఆశ్చర్యపరుస్తున్న టాలీవుడ్ నటుడి స్పీడు
విభిన్న పాత్రలు పోషిస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర కెరీర్లో హిట్ సినిమాలు చాలా తక్కువ.;
అందాల రాక్షసి సినిమాలో మంచి నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లే రేంజ్ హిట్లు అయితే అతనికి దక్కలేదు. దీంతో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు నవీన్ చంద్ర.
విభిన్న పాత్రలు పోషిస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర కెరీర్లో హిట్ సినిమాలు చాలా తక్కువ. అందుకే స్టార్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, గేమ్ ఛేంజర్, వీర సింహారెడ్డి లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. వేరే హీరోలు నటిస్తున్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టడంతో ఇక నవీన్ కు హీరోగా అవకాశాలు రావేమో అనుకున్నారంతా.
కానీ ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్న టైమ్ లో నవీన్ చంద్ర కెరీర్ ఊపందుకుంది. అతని సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉండటంతో నిర్మాతలు నవీన్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఆఫర్లు వస్తున్నప్పుడే వాటిని అందుకుని సినిమాలు చేయాలని డిసైడయ్యాడు నవీన్ చంద్ర.
అలాగని ఆఫర్లు వస్తున్నాయని ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. బాగా ఆలోచించి తనకు సూటయ్యే పాత్రలను మాత్రమే ఒప్పుకుంటున్న నవీన్ ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గత నెలలో వారం గ్యాప్ లోనే నవీన్ నటించిన బ్లైండ్ స్పాట్, లెవెన్ సినిమాలు రిలీజవగా వాటిలో లెవెన్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.
థియేటర్ రన్ ముగిశాక ఈ రెండు సినిమాలూ ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా తక్కువ టైమ్ లోనే ఆ రెండు సినిమాలూ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఆ రెండు సినిమాలను ఆడియన్స్ చూసే లోపే నవీన్ చంద్ర ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. జులై 4న నవీన్ నటించిన షో టైమ్ అనే క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే నవీన్ స్పీడు పెంచినప్పటి నుంచి చేస్తున్న సినిమాలన్నీ క్రైమ్ సినిమాలే కావడం విశేషం. అందులో కొన్ని నెగిటివ్ షేడ్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నవీన్ ఇక మీదట తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే సపోర్టింగ్ రోల్స్ లో నటించనని చెప్తున్నాడు. ఏదేమైనా కేవలం రెండు నెలల్లో నవీన్ నుంచి 3 సినిమాలు రావడంతో అతని స్పీడు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.