పెర్త్ లో సోదరి ఇంట్లో నటుడు!
ఇండస్ట్రీలో సక్సెస్ ..ఫెయిల్యూర్స్ సహజం. కానీ ఎంతో నమ్మి చేసిన చిత్రాలు వైఫల్యం చెందితే మాత్రం ఆ బాధ వర్ణానాతీతం.;
ఇండస్ట్రీలో సక్సెస్ ..ఫెయిల్యూర్స్ సహజం. కానీ ఎంతో నమ్మి చేసిన చిత్రాలు వైఫల్యం చెందితే మాత్రం ఆ బాధ వర్ణానాతీతం. మిగతా ఫెయిల్యూర్స్ కంటే ఆ వైఫల్యాలు రెట్టింపు బాధకు గురి చేస్తుంటాయి. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరూ ఈ రకమైన పరిస్థితులు చూసిన వారే. తాజాగా నటుడు నవదీప్ కూడా అలాంటి ఫేజ్ ని ఎదుర్కున్నట్లు తాజాగా తెలిపాడు. నవదీప్ హీరోగా చాలా కాలానికి `లవ్ మౌళి` అనే చిత్రంతో ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అయింది.
పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్ ప్రతీది సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. సరైన టైమ్ లో నవదీప్ సరైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు? అని మీడియాలో పాజిటివ్ బజ్ మొదలైంది. నటుడిగా అతడి జీవితాన్నే మార్చే చిత్రమవుతుందని తనతో పాటు అతడి ఫాలోవర్లు కూడా నమ్మారు. అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన నవదీప్ కి రాక రాక హీరోగా వచ్చిన అవకాశం కూడా అదే. దీంతో నవదీప్ సినిమాపై చాలా ఎఫెర్ట్ పెట్టి చేసాడు. కానీ ఆ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదు. విమర్శకులు పెదవి విరిచేసారు.
సినిమా బడ్జెట్ పరంగానూ బాగానే ఖర్చు చేసారు. కంటెంట్ పై నమ్మకంతో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. కానీ తొలి షో టాక్ తో డిజాస్టర్ బొమ్మగా తేలిపోయింది. రెండవ ఆట నుంచి థియేటర్ నుంచి బొమ్మ తొలగించే ప్రక్రియ ప్రారంభిచారు. ఈ సినిమా వైఫల్యం నవదీప్ ని ఎంతగా నిరుత్సాహ పరిచిందంటే? ఏకంగా నటనకు గుడ్ బై చెప్పేయాలనుకున్నాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయంగా లవ్ మౌళి పరాజయాన్ని గుర్తు చేసుకున్నాడు. వైఫల్యం తర్వాత హైదరాబాద్ లో..సినిమా వాతావరణంలో ఉండటం ఇష్టం లేక తన సోదరి ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఉంటే అక్కడికి వెళ్లాడుట.
అక్కడ దాదాపు మూడు నెలలు పాటు ఉండిపోయానన్నాడు. మళ్లీ తిరిగి రావాలనిపించలేదన్నాడు. నటన కూడా వదిలేసి మరో వృత్తిలోకి వెళ్లి పోవాలనుకున్నాడుట. కానీ కొన్ని రోజులకు అన్ని సర్దు కోవడంతో తిరిగి మళ్లి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి దేనిని అతిగా నమ్మడం గానీ, ప్రేమ, మమకారం లాంటివి పెంచుకోకూడదు అన్న విషయాన్ని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే నవదీప్ ఇంకా వివాహం చేసుకోని సంగతి తెలిసిందే. సోలోగా ఉండటమే అతడికి ఇష్టమని గతంలో కొన్నిసార్లు చెప్పకనే చెప్పాడు.