ఆయ‌న వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా!

టాలీవుడ్‌లో తరాలు మారినా, ట్రెండ్‌లు మారినా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగిన హీరోల్లో అక్కినేని నాగార్జున పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

Update: 2026-05-24 10:51 GMT

టాలీవుడ్‌లో తరాలు మారినా, ట్రెండ్‌లు మారినా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగిన హీరోల్లో అక్కినేని నాగార్జున పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. 1986లో విడుదలైన విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమైన నాగ్, ఇప్పుడు తన 100వ సినిమాకి సిద్ధమవుతున్న దశలో ఉండటం ఆయన సినీ ప్రయాణానికి ఉన్న ప్రత్యేకతను మరోసారి గుర్తుచేస్తోంది. నాలుగు దశాబ్దాలుగా రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, క్లాస్ నటుడిగా, ప్రయోగాలకు వెనుకాడని ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను నిర్మించుకున్న ఆయన ఇప్పుడు కింగ్100తో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తన 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నాగార్జున చెప్పిన వ్యక్తిగత విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

చిన్నప్పటి నుంచి హీరో కావాలనే కల తనకు ఎప్పుడూ లేదని నాగార్జున చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కొడుకైనా, హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ రోజుల్లో తనకెలాంటి ప్రత్యేక ట్రీట్మెంట్ లభించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణ స్టూడెంట్ లాగే పెరిగానని, చదువులో టాపర్ కూడా కాదని సరదాగా చెప్పుకొచ్చారు. ఐదో తరగతిలో స్కూల్ డ్రామాలో తనకు ఆడవేషం వేయించారని, అప్పుడు చాలా మంది ఆటపట్టించడంతో తీవ్రంగా సిగ్గుపడ్డానని వెల్లడించారు. ఆ రోజు తర్వాత మళ్లీ డ్రామాల జోలికి వెళ్లలేదంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్న నాగ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సుడిగుండాలు సినిమాలో కేవలం 30 సెకన్ల పాత్రతో తొలిసారి మేకప్ వేసుకున్న సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోవడం విశేషం.

నాగార్జున సినీ ప్రయాణంలో అసలు మలుపు ఆయన అన్నయ్య వెంకట్ వల్లే వచ్చిందని చెబుతారు. ఫిల్మ్ ప్రొడక్షన్ వైపు వెళ్లాలనుకున్న తనను సినిమాల్లో నటించమని వెంకట్ ప్రోత్సహించారని నాగ్ వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, కెరీర్ స్టార్టింగ్ లో విమర్శలు కూడా ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే అక్కడి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున, ప్రతి దశలో తనను తాను కొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగారు. శివతో యూత్ ఐకాన్‌గా మారిన ఆయన, గీతాంజలితో ప్రేమకథలకు కొత్త అందం తీసుకొచ్చారు. హలో బ్రదర్‌తో కామెడీ టైమింగ్, నిన్నే పెళ్లాడతాతో ఫ్యామిలీ ఎమోషన్స్, అన్నమయ్యతో భక్తిరస నటన, మన్మథుడుతో రొమాంటిక్ ఇమేజ్, సోగ్గాడే చిన్నినాయనాతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇమేజ్‌ను బలపరిచారు. ఒకే తరహా సినిమాల్లో కాకుండా ప్రతి జానర్‌లో విజయాలు అందుకోవడం నాగ్ కెరీర్ ప్రత్యేకతగా నిలిచింది.

టాలీవుడ్‌లో స్టైల్ మరియు ఫ్యాషన్ ట్రెండ్‌ల విషయంలో కూడా నాగార్జున ప్రత్యేక ముద్ర వేశారు. సినిమాల్లో జీన్స్ ధరించే ట్రెండ్ తనతోనే ఎక్కువగా మొదలైందని ఆయన చెప్పిన మాటల్లో అతిశయోక్తి కనిపించదు. 80స్ చివరి నుంచి 90స్ వరకు యూత్‌లో నాగ్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, మేకోవర్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకోవడంలో నాగ్ స‌క్సెస్ అయ్యారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఇప్పటికే కుబేర, కూలీ వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున.. ఇప్పుడు కింగ్100తో మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి. విక్రమ్‌తో మొదలైన ఈ ప్రయాణం కింగ్100 వరకు చేరుకోవడం కేవలం ఒక హీరో విజయగాథ మాత్రమే కాదు, కాలానికి తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ నిలబడిన ఓ స్టార్ పరిణామక్రమం కూడా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News