నడిగర సంఘం భవంతి రెడీ.. `MAA` భవంతి ఎప్పటికి?
దక్షిణ భారత కళాకారుల సంఘం (నడిగర్ సంఘం) సొంత భవంతి నిర్మాణం దశాబ్ధ కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.;
దక్షిణ భారత కళాకారుల సంఘం (నడిగర్ సంఘం) సొంత భవంతి నిర్మాణం దశాబ్ధ కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భవంతి నిర్మాణం చుట్టూ చాలా రాజకీయాలు నడిచాయి. స్టార్ హీరో విశాల్ బస్తీ మే సవాల్ అంటూ ప్రత్యర్థి శరత్ కుమార్ పై ఛాలెంజ్ లు చేసారు. భవంతి నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లాడతానని ఛాలెంజ్ చేసారు. ఎట్టకేలకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న భవనం నిర్మాణం చివరి దశకు చేరుకుందని అధికారికంగా ప్రకటించారు. తాజాగా నాజర్- కార్తీ- విశాల్ బృందం ఒక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రాజెక్ట్ పూర్తయిందని గర్వంగా ప్రదర్శిస్తూ అసోసియేషన్ ఒక వివరణను ఇచ్చింది. చాలా సవాళ్ల తర్వాత ఈ నిర్మాణాన్ని చూడటం అందరికీ ఆనందాన్నిస్తోంది.
నిజానికి నడిగర సంఘం భవంతికి నాజర్ నాయకత్వంలో 2016లో పునాది వేసారు. నటుడు నాజర్, అతడి టీమ్ నడిగర్ సంఘం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అప్పట్లో ప్రారంభమైంది. అసోసియేషన్ యాజమాన్యంలోని స్థలంలోనే కొత్త భవనం నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులను సేకరించేందుకు భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో భవనం నిర్మాణంలో 75 శాతం పూర్తయింది. అయితే అసోసియేషన్ ఎన్నికల్లో ఆర్టిస్టుల మధ్య విభేధాలు కొన్ని సమస్యల్ని సృష్టించాయి. దీంతో భవంతి నిర్మాణం మూడేళ్లుగా నత్తనడకన సాగింది.
నాజర్ వర్సస్ భాగ్యరాజ్.. విశాల్ వర్సెస్ శరత్ కుమార్ కలహాలు పెను సమస్యల్ని సృష్టించాయి. ఈ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలకు పైగా నిలిచిపోయింది. ఇంతలో నిర్మాణ సామాగ్రి, ఇతర వస్తువుల ధరలు పెరిగి బడ్జెట్ ని కూడా పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. చివరికి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈసీ సభ్యుల ఆమోదంతో బ్యాంకు రుణం తీసుకోవాలని ప్రతిపాదించారు. అదనంగా వచ్చే నిధులతో నిర్మాణం తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. పెండింగ్ 25 శాతం నిర్మాణం పూర్తయితే, ఇక గ్రాండ్ గా లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. కొత్త వీడియో చూడగానే నడిగర సంఘం దశాబ్ధాల కల ఇప్పటికి నెరవేరబోతోందని ఒక హోప్ వచ్చింది.
టాలీవుడ్ లోను 1000 మంది పైగా సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) భవంతి నిర్మాణం కోసం దశాబ్ధ కాలంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. లెజెండరీ నటులు మెగాస్టార్ చిరంజీవి, కీ.శే. ఘట్టమనేని కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి వారు పూనుకున్నా ఇప్పటికీ దానికి పునాది రాయి కూడా పడలేదు. ప్రస్తుత `మా` అధ్యక్షుడు మంచు విష్ణు ప్రతిపాదన తెచ్చినా, పనులు సజావుగా సాగలేదు. దీనికి ఫిలింనగర్ పరిసరాల్లో సరైన స్థలం అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. సీనియర్ స్టార్లతో నేటితరం స్టార్లు కలిసి సొంత భవంతి నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా భావిస్తేనే అది ఎప్పటికి అయినా సాధ్యమవుతుందని ఆశ.