మెగా విక్టరీ మాస్ సాంగ్.. ఎలా ఉందంటే..
సినిమాలోని స్పెషల్ పార్టీ నెంబర్ 'మెగా విక్టరీ మాస్' సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఇది పక్కా మాస్ సెలబ్రేషన్ సాంగ్ లా అనిపిస్తోంది.;
సంక్రాంతి బరిలో దిగుతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెరిగాయి. ఇప్పటికే రిలీజైన 'మీసాల పిల్ల', 'శశిరేఖ' పాటలు క్లాస్, మెలోడీ ప్రియులను ఆకట్టుకోగా, ఇప్పుడు మాస్ ఆడియెన్స్ కోసం అసలైన ట్రీట్ వచ్చేసింది. సినిమాలోని స్పెషల్ పార్టీ నెంబర్ 'మెగా విక్టరీ మాస్' సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఇది పక్కా మాస్ సెలబ్రేషన్ సాంగ్ లా అనిపిస్తోంది.
ఈ పాటలో ఉన్న అసలైన హైలెట్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా, హుషారుగా స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు కనుల పండుగగా ఉంది. చిరు డెనిమ్ జాకెట్ లో స్టైలిష్ గా కనిపిస్తుంటే, వెంకీ రెడ్ షర్ట్ లో అంతే ఎనర్జిటిక్ గా కనిపించారు. వీరిద్దరి బాండింగ్, ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ వేసిన స్టెప్పులు వీడియోకి హైలైట్ గా నిలిచాయి.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన మార్క్ మాస్ బీట్స్ తో ఈ పాటను కంపోజ్ చేశారు. డప్పు సౌండ్స్, ఎలక్ట్రానిక్ మిక్స్ తో సాగిన ఈ ట్యూన్ వినగానే కాలు కదిపేలా ఉంది. సింగర్స్ నకాష్ అజీజ్, విశాల్ దద్లానీ తమ గొంతుతో పాటకు కావాల్సిన హై పిచ్ ఎనర్జీని అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ లో "అన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్.. తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్" అంటూ సాగే లైన్స్ ఇద్దరి స్టార్ డమ్ ని బ్యాలెన్స్ చేస్తూ క్యాచీగా ఉన్నాయి.
ఇక కొరియోగ్రఫీ విషయానికి వస్తే, విజయ్ పొలకి కంపోజ్ చేసిన స్టెప్పులు మరీ క్లిష్టంగా లేకుండా, థియేటర్లో ఫ్యాన్స్ కూడా లేచి డ్యాన్స్ చేసేలా సింపుల్ గా డిజైన్ చేశారు. చిరులోని గ్రేస్, వెంకీలోని జోవియల్ నేచర్ ని వాడుకుంటూ మాస్ స్టెప్పులు వేయించారు. వెనుక డ్యాన్సర్లు, కలర్ ఫుల్ సెట్, లైటింగ్ అంతా కలిసి వీడియోకి ఒక గ్రాండ్ లుక్ ని తీసుకొచ్చాయి.
మొత్తంగా చూస్తే ఇది కథలో వచ్చే ఒక సందర్భానుసారమైన పాటలా, అలాగే ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రమోషనల్ సాంగ్ లా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మాస్ ఫ్యాన్స్ ఇద్దరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పాటను ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.
సంక్రాంతి రేసులో వినోదమే ప్రధాన ఆయుధంగా వస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. పాటలతో బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన చిత్ర యూనిట్, థియేటర్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ 'మెగా విక్టరీ మాస్' పాట సోషల్ మీడియాలో రీల్స్ కి మంచి స్టఫ్ అయ్యేలా ఉంది.