‘మిరాయ్’పై ఏ ధైర్యంతో డబ్బులు పెట్టారంటే..?

‘మిరాయ్’ సినిమా మొదలయ్యే సమయానికి.. తేజ సజ్జ చివరి చిత్రం ‘హనుమాన్’ ఇంకా రిలీజ్ కాలేదు. అప్పటికి అతను చిన్న హీరోనే.;

Update: 2025-09-13 12:31 GMT

‘మిరాయ్’ సినిమా మొదలయ్యే సమయానికి.. తేజ సజ్జ చివరి చిత్రం ‘హనుమాన్’ ఇంకా రిలీజ్ కాలేదు. అప్పటికి అతను చిన్న హీరోనే. ఇక దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విషయానికి వస్తే అంతకుముందు అతను ‘సూర్య వెర్సస్ సూర్య’ అనే ఫ్లాప్ చిత్రం తీశాడు. అది మంచి ప్రయోగమే అయినా.. సినిమా ఆడలేదు. కానీ తమ బేనర్లో రవితేజతో పెద్ద బడ్జెట్లో ‘ఈగల్’ చేసేందుకు కార్తీక్‌కు అవకాశమిచ్చిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.. ఆ సినిమా మేకింగ్ మధ్యలోనే ‘మిరాయ్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరి ఏ ధైర్యంతో ఈ చిత్రాన్ని పెద్ద బడ్జెట్లో చేయడానికి విశ్వ ప్రసాద్ ముందుకొచ్చారనే సందేహం కలగడం సహజం. దీనికి ‘మిరాయ్’ సక్సెస్ మీట్లో సమాధానం ఇచ్చారు విశ్వ ప్రసాద్. కార్తీక్‌తో ‘మిరాయ్’ మొదలుపెట్టడానికి రెండు మూడు కారణాలున్నట్లు ఆయన తెలిపారు.

టీజీ విశ్వప్రసాద్ ఒక నిర్మాతగా ఉ్న ‘కార్తీకేయ-2’కు కార్తీక్ ఘట్టమనేనినే సినిమాటోగ్రాఫర్. ఐతే ఆ చిత్రానికి తాము అనుకున్న బడ్జెట్ అంతా అయిపోయి.. ఫండ్స్ విషయంలో ఇబ్బంది పడ్డట్లు విశ్వప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో ప్రిక్లైమాక్స్‌లో వచ్చే మంచు కొండ ఎపిసోడ్‌ను రియల్ లొకేషన్లకు వెళ్లి చిత్రీకరించే పరిస్థితి కనిపించలేదని.. అలాంటి టైంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర్లో ఒక బ్లాక్ స్టోన్ ఉన్న ప్రదేశంలో తక్కువ ఖర్చుతో ఆ సన్నివేశాలను తీసి, వీఎఫెక్స్‌తో కవర్ చేసేలా కార్తీక్ డిజైన్ చేశాడని.. ఆ ఐడియా తమను ఎంతో సేవ్ చేసిందని విశ్వ ప్రసాద్ వెల్లడించాడు.

అలాగే తన ప్రొడక్షన్లో వచ్చిన మరో సినిమా ‘గూఢచారి-2’కు సంబంధించి కార్తీక్ తీసిన రెండు నిమిషాల ఎపిసోడ్ చూసి తాను ఆశ్చర్యపోయానని.. అతను తక్కువ బడ్జెట్లో మంచి ఔట్ పుట్ ఇవ్వగలడని అనిపించిందని.. దీనికి తోడు ‘మిరాయ్’ విషయంలో తన విజన్ నచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకున్నానని.. అలా ‘మిరాయ్’ మొదలైందని విశ్వప్రసాద్ వెల్లడించారు.

Tags:    

Similar News