వేధింపులపై ప్రముఖ నటి పోలీసులకు ఫిర్యాదు
అయితే నిర్వాహకుల వాదన మరొకలా ఉంది. క్లబ్ సభ్యులు మిమీ చక్రవర్తి ఆరోపణలను తోసిపుచ్చారు. మిమీ రాత్రి 10:30 గంటలకు రావాల్సి ఉండగా, సుమారు 90 నిమిషాలు ఆలస్యంగా చ్చారని వివరణ ఇచ్చారు.;
ఇటీవల పబ్లిక్ వేదికలపై ప్రదర్శన ఇచ్చేందుకు వెళుతున్న చాలా మంది కథానాయికలకు వేధింపులు ఎక్కువైన సంగతి తెలిసిందే. పబ్లిక్ మీది మీదికి ఉరకడంతో ఏమీ తోచని దుస్థితి ఎదురవుతోంది. బౌన్సర్లు, వ్యక్తిగత సెక్యూరిటీ ఉన్నా నిలువరించలేని పరిస్థితి ఉంది. సమంత, దళపతి విజయ్ వంటి స్టార్లకు ఇలాంటి పరిస్థితి దాపురించింది.
ఇప్పుడు నటి కం మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి ఒక భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బొంగావ్ లో ఒక ప్రదర్శన సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 జనవరి 2026న జరిగిన ఒక కార్యక్రమంలో నిర్వాహకులు తనను బహిరంగంగా అవమానించారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర 24 పరగణాలలోని ``నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ క్లబ్`` నిర్వహించిన కార్యక్రమంలో మిమీ ప్రదర్శన ఇస్తుండగా, నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి స్టేజ్ పైకి వచ్చి ఆమెను వెంటనే దిగిపోవాలని ఆదేశించారు. తాను స్టేజ్ దిగి వెళ్తున్న సమయంలో మైక్రోఫోన్ ద్వారా తనపై అసభ్యకరమైన, గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె బొంగావ్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అయితే నిర్వాహకుల వాదన మరొకలా ఉంది. క్లబ్ సభ్యులు మిమీ చక్రవర్తి ఆరోపణలను తోసిపుచ్చారు. మిమీ రాత్రి 10:30 గంటలకు రావాల్సి ఉండగా, సుమారు 90 నిమిషాలు ఆలస్యంగా చ్చారని వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటల వరకే కార్యక్రమానికి అనుమతి ఉన్నందున, చట్టపరమైన ఇబ్బందులు రాకుండా షోను ఆపివేయాల్సి వచ్చిందని వారు వాదించారు. మిమీతో వచ్చిన బౌన్సర్లు క్లబ్ మహిళా సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారని నిర్వాహకులు ఎదురుదాడి చేశారు.
ప్రస్తుతం బొంగావ్ పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళా కళాకారుల భద్రత, గౌరవంపై ఈ ఘటన ఇప్పుడు బెంగాల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల తదుపరి చర్యల గురించి గానీ లేదా మిమీ చక్రవర్తి స్పందన గురించి గానీ ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మిమీ చక్రవర్తి బెంగాళీ నటి. హిందీలోను నటించింది. తదుపరి తెలుగులో అడుగు పెట్టేందుకు ప్రముఖ నిర్మాతలతో టచ్ లో ఉన్నారని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.