హీరో నేనే విలనూ నేనే.. 'యానిమల్' 3 భాగాలుగా!
రణబీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్‌లో `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
రణబీర్ కపూర్ - సందీప్ వంగా కాంబినేషన్‌లో `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఒక సీక్వెల్‌తో ముగిసిపోయేది కాదు.. మొత్తం మూడు భాగాలుగా రాబోతోంది. ఆ మేరకు రణబీర్ కపూర్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ కథను ఒక ట్రయాలజీగా ప్లాన్ చేశారు. మొదటి భాగం `యానిమల్` కాగా, రెండో భాగం `యానిమల్ పార్క్`. మూడవ భాగానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇంతలోనే ఇప్పుడు యానిమల్ సీక్వెల్ `యానిమల్ పార్క్` షూటింగ్ 2027 లో ప్రారంభం కానుందని రణబీర్ ధృవీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వేచి చూడక తప్పదని కూడా రణబీర్ అన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా `స్పిరిట్` సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే సీక్వెల్ పట్టాలెక్కుతుంది. యానిమల్ రెండో భాగంలో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తారు. మొదటి భాగం చివరలో చూపించిన నెగటివ్ క్యారెక్టర్ (అజీజ్) కి, రణవిజయ్ కి మధ్య జరిగే పోరు చాలా భయంకరంగా ఉండబోతుందని సమాచారం.
రెండో భాగంలో విలన్ ఎవరంటే..? మొదటి భాగం చివరిలో అజీజ్ అనే పాత్ర ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రణబీర్ (రణవిజయ్) పోలికలను పొందుతుంది. అంటే రెండో భాగం `యానిమల్ పార్క్`లో రణబీర్ తనతో తనే యుద్ధం చేసుకోబోతున్నారు. ఈ సినిమాలో విలన్ `అజీజ్` పాత్ర రణవిజయ్ కంటే క్రూరంగా ఉంటుందని సమాచారం. ``ఇది చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. హీరో, విలన్.. ఈ రెండు పాత్రలనూ నేనే పోషిస్తున్నాను`` అని రణబీర్ స్వయంగా వెల్లడించారు.
మొదటి భాగంలో తండ్రి (అనిల్ కపూర్) కోసం రణవిజయ్ చేసిన విధ్వంసాన్ని చూశాం. రెండో భాగంలో ఈ బంధం ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, తండ్రిని కాపాడుకోవడానికి ఈ `డబుల్ రోల్` చిక్కుముడులను రణవిజయ్ ఎలా విప్పుతాడో అనేది కథలో కీలకం కానుంది.
2027లో యానిమల్ పార్క్ షూటింగ్ మొదలవుతుంది. అయితే అంతకంటే ముందే రణబీర్ నుండి మరికొన్ని భారీ చిత్రాలు రానున్నాయి. వీటిలో భన్సాలీ `లవ్ అండ్ వార్` జూన్ 2026లో విడుదల కానుంది. అటుపై నితీష్‌తివారీతో `రామాయణం` 2026 దీపావళికి విడుదలవుతుంది.
సీక్వెల్ ఆలస్యానికి కారణమేమిటి? అని ప్రశ్నిస్తే, సినిమా నాణ్యతను పెంచడానికే తప్ప వెనకడుగు వేయడం కాదని రణబీర్ స్పష్టం చేశారు. సందీప్ వంగా ఈ పాత్రల మనస్తత్వాలను ఇంకా లోతుగా విశ్లేషించాలని భావిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే ఆ `తీవ్రమైన డ్రామా`ను మళ్ళీ పెద్ద తెరపై చూడాలంటే 2027 వరకు ఓపిక పట్టాల్సిందే!