కలల్ని మించి నాకు లభించిన గౌరవం: R. మాధవన్
R. మాధవన్ కి భారత ప్రభుత్వం `పద్మశ్రీ` పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.;
R. మాధవన్ కి భారత ప్రభుత్వం `పద్మశ్రీ` పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ గౌరవం తన ఊహకు అందలేదని ఆయన పేర్కొన్నారు. 26 జనవరి 2026న ప్రకటించిన ఈ పద్మ అవార్డుల జాబితాలో మాధవన్ పేరు ఉండటంపై ఆయన ఎమోషనల్ గా స్పందించారు.
అవార్డు ప్రకటించిన వెంటనే మాధవన్ తన సోషల్ మీడియాలో ఇలా రాశారు. ``ఈ గౌరవం లభించడం నాకెంతో గర్వంగా ఉంది. ఒక నటుడిగా, ఫిల్మ్ మేకర్‌గా నా ప్రయాణంలో ఇది అత్యంత గొప్ప క్షణం. నా కలలకు మించి ఇది నాకు లభించిన గౌరవం. నా పనిని గుర్తించినందుకు భారత ప్రభుత్వానికి, నన్ను ఆదరిస్తున్న అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను``అని ఎమోషనల్ అయ్యారు.
మాధవన్ ఈ గౌరవాన్ని తన కుటుంబానికి అంకితం చేశారు. తన ఎదుగుదలలో వారి నిరంతర మద్దతు, విశ్వాసమే తన అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకోవడం తన `అత్యంత అద్భుతమైన కలలకు కూడా అతీతం` అని ఎంతో వినమ్రంగా చెప్పారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో కూడా అర్థవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆయనకు ఈ పురస్కారం దక్కడానికి బలమైన కారణం.. మూడు దశాబ్దాలుగా దక్షిణాది , ఉత్తరాది చిత్ర పరిశ్రమలలో అద్భుతమైన నటుడిగా రాణించడమే గాక, దర్శకుడిగా మొదటి ప్రయత్నమే దార్శనికమైన సినిమాని అందించారు. ముఖ్యంగా `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్` సినిమా కోసం ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిది. ఒక శాస్త్రవేత్త పడ్డ వేదనను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, ఆ సినిమాతో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. అటు క్లాస్ సినిమాలు- సఖి, మిన్నలే తో, ఇటు మాస్ సినిమా- విక్రమ్ వేదతో, మరోవైపు సందేశాత్మక చిత్రాలతో (రాకెట్రీ) ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం.
మాధవన్ లాంటి ప్రతిభావంతుడికి ఈ గౌరవం దక్కడం పట్ల అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాధవన్‌తో పాటు ఇదే ఏడాది డియోల్ కుటుంబంలో ధర్మేంద్రకు (మరణానంతరం) పద్మ విభూషణ్ లభించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇలాంటి గౌరవం లభించడంపై అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
మాధవన్ ప్రస్తుతం `సికిందర్ శేర్గిల్` అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ `షైతాన్` సీక్వెల్‌కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి.