వెంకీ మామతో మూవీ.. తరుణ్ భాస్కర్ ప్లాన్ ఏంటి?

రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తోపాటు ఇంటర్వ్యూలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కోసం మాట్లాడారు.;

Update: 2026-01-27 15:30 GMT

అటు డైరెక్టర్.. ఇటు యాక్టర్ గా తరుణ్ భాస్కర్ తనదైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించి.. మరిన్ని చిత్రాల్లో నటించి.. అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్ భాస్కర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తోపాటు ఇంటర్వ్యూలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కోసం మాట్లాడారు. గుర్రపు పందెం జూదగాడు కథాంశంతో విక్టరీ వెంకటేష్ తో డెక్కన్ డార్బీ అనే చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు 2019లో తరుణ్ తెలిపారు.

కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆ మధ్య సినిమా నిలిచిపోయిందా.. అంటే కాదని వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ ప్రాజెక్ట్‌ ను తాత్కాలికంగా నిలిపివేయడం తన నిర్ణయమేనని తెలిపారు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లేలో, రెండో భాగంలో ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉందని, అలాగే సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా ఒక కారణమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ పై మళ్లీ సీరియస్‌ గా పని చేస్తున్నానని ఆయన వెల్లడించారు. సినిమా షూటింగ్, ఈ ఏడాదైనా లేదా తర్వాతైనా మొదలు కావచ్చని చెప్పారు. చిత్రానికి సంబంధించిన చాలా పనులు ఇంకా చేయాల్సి ఉందని డైరెక్టర్ తెలిపారు ఆ తర్వాత మరో ఇంటర్వ్యూలో.. వెంకటేష్‌ తో చేయాల్సిన సినిమా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కథను మరింత అట్రాక్టివ్ గా మార్చడానికి ప్రస్తుతం స్క్రీన్‌ ప్లేపై రీ వర్క్ చేస్తున్నానని తెలిపారు. డెక్కన్ డార్బీ అనే గుర్రాల నేపథ్యం ఉన్న కథ ఆధారంగా విభిన్నమైన ప్రాసెస్ లో తెరకెక్కుతోందని అన్నారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ కామెంట్స్‌ తో సెకండాఫ్, స్క్రీన్ ప్లే రెడీ అయితే త్వరలోనే వెంకీ- తరుణ్ భాస్కర్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.

అయితే ఆ సినిమా క్రైమ్ కామెడీ లేదా హారర్ కామెడీ నేపథ్యంలో ఉండొచ్చని గతంలో తరుణ్ సంకేతాలు ఇచ్చారు. ఏదేమైనా ఒకవేళ ఆ మూవీ పట్టాలెక్కితే, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించే తొలి చిత్రంగా ఆయన కెరీర్ లో నిలవనుంది. మరి వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ చేయనున్న మూవీ.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News