'పెద్ది' సెట్స్ లో తిలక్ వర్మ.. స్పెషల్ 'బ్యాట్' చూశారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.;

Update: 2026-03-18 12:26 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరై రారా వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మంచి హైప్‌ సృష్టించాయి.

ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. నిర్మాణ భాగస్వాములుగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కూడా ఉన్నాయి. క్రీడా నేపథ్యంలో సాగే ఆ కథలో గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు ముఖ్యంగా ఉండనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తాజాగా పెద్ది సెట్స్‌ లో టీమిండియా యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సందడి చేశారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ లో అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందిన తిలక్ వర్మ, పెద్ది షూటింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా స్పోర్ట్స్ సీన్స్ ను చూసి, చిత్ర యూనిట్ పనితీరుకు ప్రశంసలు కురిపించారు.

సెట్స్‌ లో హీరో రామ్ చరణ్‌ తో తిలక్ వర్మ ఫ్రెండ్లీగా ముచ్చటించడం అభిమానులను ఆకట్టుకుంది. ఆ సందర్భంగా రామ్ చరణ్, తిలక్ వర్మకు ప్రత్యేకంగా ఒక బ్యాట్‌ ను గిప్ట్ గా అందించారు. పెద్ది సినిమా షూటింగ్‌ లో ఉపయోగించిన పాత బ్యాట్‌ ను గుర్తుగా ఇచ్చి, దానిపై తన ఆటోగ్రాఫ్ కూడా చేశారు. ఆ గిఫ్ట్ తిలక్ వర్మకు మరింత ఆనందాన్ని కలిగించినట్లు కనిపిస్తోంది.

అంతేకాకుండా, వరల్డ్ కప్‌ లో తిలక్ వర్మ ప్రదర్శనపై రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అతని టాలెంట్ ను మెచ్చుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు తిలక్ వర్మ కూడా పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. రామ్ చరణ్‌ పై తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఇద్దరూ హగ్ చేసుకోవడం విశేషం.

సెట్స్‌ లో ఉన్న కొందరు సిబ్బంది, అభిమానులకు తిలక్ వర్మ ఆటోగ్రాఫ్ ఇచ్చారు అయితే తిలక్ విజిట్ కు సంబంధించిన వీడియోను పెద్ది చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. "టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ తిలక్ వర్మ పెద్ది సెట్స్‌ ను సందర్శించారు. సినిమా స్పోర్ట్స్ సీక్వెన్స్‌ ను చూసి ఫిదా అయ్యారు" అని మేకర్స్ ట్వీట్ చేశారు. పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాటలు, ప్రమోషన్స్ తో ఆసక్తి పెంచిన ఆ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News