మ‌మ్ముట్టిని ప‌ద్మ‌భూష‌ణ్ వ‌రించ‌డం వెన‌క‌..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కి భారత ప్రభుత్వం `పద్మభూషణ్` (2026) పురస్కారాన్ని ప్రకటించడం ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణానికి దక్కిన గౌరవం.;

Update: 2026-01-28 00:30 GMT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కి భారత ప్రభుత్వం `పద్మభూషణ్` (2026) పురస్కారాన్ని ప్రకటించడం ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణానికి దక్కిన గౌరవం. ఆయన ఈ అవార్డుకు ఎందుకు అర్హుడో, అత‌డి కెరీర్ విశేషాలేమిటో స‌వివ‌రంగా ప‌రిశీలిస్తే...

మమ్ముట్టి కేవలం భార‌త‌దేశంలోని అత్యంత గొప్ప న‌టుల‌లో ఒక‌రు. ఆయ‌న‌ ఒక నటుడు మాత్రమే కాదు.. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప కళాకారుడు. మలయాళంతో పాటు తెలుగు, త‌మిళంలోను రాణించారు. తెలుగులో స్వాతికిరణం, యాత్ర అనే రెండు సినిమాలు చేయ‌గా, తమిళంలో ద‌ళపతి, హిందీ, కన్నడ, ఆంగ్ల చిత్రాల్లో నటించి `పాన్-ఇండియా` స్టార్‌గా ఎప్పుడో గుర్తింపు పొందారు.

ఆయ‌న `కేర్ అండ్ షేర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్` ద్వారా వేలమందికి ఉచిత వైద్యం, విద్యను అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆయన చేస్తున్న సేవలు అమోఘం. నిజానికి ఆయ‌న‌కు 70 ఏళ్లు దాటినా, ఇప్పటికీ ప్రయోగాత్మక చిత్రాలు భ్రమయుగం, కాదల్ వంటివి చేస్తూ యువ నటులకు పోటీనిస్తున్నారు.

మ‌మ్ముట్టి స్వ‌గ‌తం...

మమ్ముట్టి స్వ‌గ‌తం ప‌రిశీలిస్తే, ఆయ‌న‌ అసలు పేరు ముహమ్మద్ కుట్టి. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. 1971లో `అనుభవంఘళ్ పాళిచకళ్` చిత్రంతో చిన్న పాత్రలో ప్రవేశించారు. 1980ల్లో వచ్చిన `న్యూఢిల్లీ` చిత్రం ఆయనను సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. మమ్ముట్టి సుమారు 400 పైగా సినిమాల్లో నటించారు. యాక్షన్, సెంటిమెంట్, హిస్టారికల్ రోల్స్ చేయడంలో ఆయనది అందెవేసిన చేయి అని నిరూపిత‌మైంది.

మతిలుకళ్, పొంతన్ మాడ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి చిత్రాల్లో న‌ట‌న‌కు గాను మ‌మ్ముట్టిని మూడు సార్లు జాతీయ ఉత్తం న‌టుడు అవార్డులువ‌రించాయి. 8 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 1998లోనే భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో గౌరవించింది. కేరళ , కాలికట్ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు.

పద్మభూషణ్ గెలవాలంటే అర్హతలు?

పద్మ విభూషణ్ తర్వాత, పద్మభూషణ్ భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం. దీనికి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు ప‌రిశీలిస్తే, ఏదైనా రంగంలో (కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ) అసాధారణమైన కృషి చేసి ఉండాలి. ఒక వ్యక్తి తన రంగంలో సుదీర్ఘకాలం పాటు దేశానికి లేదా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. సదరు వ్యక్తి చేసిన పని వల్ల జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఉండాలి. సాధారణంగా పద్మశ్రీ పొందిన కొంత కాలం తర్వాత, ఆ వ్యక్తి కృషి కొనసాగితే పద్మభూషణ్ కు పరిగణనలోకి తీసుకుంటారు. మమ్ముట్టికి పద్మశ్రీ వచ్చి 28 ఏళ్లు దాటింది. ఇప్ప‌టికి పద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ద‌క్కింది.

మమ్ముట్టి కేవలం కలెక్షన్ల కోసం కాకుండా.. త‌న‌లోని నటుడిని బతికించడం కోసం సినిమాలు చేస్తారు. ఆయన ఈ వయసులో కూడా చేస్తున్న ప్రయోగాలు చూస్తే,.. పద్మభూషణ్ ఆయనకు తక్కువని, పద్మ విభూషణ్ కూడా ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News