'విరోష్' బ్రాండ్ కు భారీ ఆఫర్స్.. కానీ..
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విరోష్ జంట ఇప్పుడు బ్రాండింగ్ వరల్డ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.;
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విరోష్ జంట ఇప్పుడు బ్రాండింగ్ వరల్డ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కలిసి కనిపిస్తే అభిమానులు ఎంతగా స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే ఆ జంటపై సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. క్యూట్ కపుల్ గా పేరొందిన వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.
ఇటీవల వీరిద్దరి వివాహం జరగ్గా.. బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలకు 20 మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం. రికార్డు స్థాయి రెస్పాన్స్ తో విరోష్ బ్రాండ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆ పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో అత్యధిక లైక్స్ సాధించిన పోస్టులతో ఏకంగా పోటీ పడడం గమనార్హం.
అదే సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా వీరి పెళ్లి హక్కులను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు సమాచారం. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫుటేజ్ ను ప్రసారం చేయాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చిందట. అయితే, వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయాలనుకోకపోవడంతో విజయ్, రష్మిక ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ వ్యక్తిగత విషయాలను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదనే అభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్.
అయితే విరోష్ పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వారి వద్దనే ఉన్నాయి. ఆ ఫుటేజ్ ను సోషల్ మీడియాలో విడుదల చేసినా భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు వారు ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో అనేక ప్రముఖ బ్రాండ్లు ఆ జంటను కమర్షియల్ యాడ్స్ కోసం సంప్రదిస్తున్నాయట!
భారీ రేంజ్ లో ఆఫర్స్ ఇస్తుండడంతో విరోష్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం అత్యంత హైయెస్ట్ రేంజ్ కు చేరిందని మార్కెట్ లో టాక్ వినిపిస్తోంది. తమ బ్రాండ్ తో సందడి చేస్తే భారీ స్థాయిలో రీచ్, ఎంగేజ్మెంట్ వస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే కోట్ల రూపాయల ఆఫర్లతో జంటను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ విజయ్, రష్మిక ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం.
సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి తర్వాత బ్రాండ్ విలువ పెరగడం సహజమే. కానీ విరోష్ కు భారీగా డిమాండ్ రావడం అరుదైన విషయం. ఇప్పటివరకు ఎన్నో సెలబ్రిటీ జంటలు వివాహం చేసుకున్నా, ఈస్థాయి కమర్షియల్ ఇంట్రెస్ట్ కనిపించలేదని టాక్ వినిపిస్తోంది. ఇది పూర్తిగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వ్యక్తిగత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే సాధ్యమైందని అంతా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, విరోష్ జంట ప్రస్తుతం కేవలం సినీ రంగంలోనే కాకుండా బ్రాండ్ మార్కెట్ లో కూడా సెన్సేషన్ గా మారింది.