లండన్ మ్యూజికల్ నుండి అరియానా గ్రాండే ఔట్
అయితే కొద్దికాలంగా అరియానపై వస్తోన్న పబ్లిక్ స్క్రిటినీ ..నిరంతర ఆన్‌లైన్ చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరియానా ప్రతినిధి తెలిపారు.
ప్రముఖ పాప్ స్టార్, నటి అరియానా గ్రాండే కెరీర్‌కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని ప్రసిద్ధ బాంబికన్ థియేటర్‌లో 2027లో ప్రదర్శించడానికి సిద్ధమైన `స్టేజ్ మ్యూజికల్ సండే ఇన్ ది పార్క్ విత్ జార్జ్` ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం హాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రతిష్టాత్మక నాటకంలో అరియానా `వికెడ్` సహనటుడు జోనాథన్ బెయిలీతో కలిసి నటించాల్సి ఉంది. అయితే కొద్దికాలంగా అరియానపై వస్తోన్న పబ్లిక్ స్క్రిటినీ ..నిరంతర ఆన్‌లైన్ చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరియానా ప్రతినిధి తెలిపారు.
తనపై వస్తోన్న అనవసరమైన వ్యాఖ్యల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు గతంలోనూ అరియానా పలుమార్లు వెల్లడించారు. ప్రస్తుతం అరియానా కొనసాగిస్తున్న `ఎటర్నల్ సన్‌షైన్ టూర్` ముగిసిన వెంటనే ఆమె పూర్తిగా ప్రజల దృష్టికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న లండన్‌లో ఈ మ్యూజికల్ టూర్ ముగియనుందని.. ఆ తర్వాత కొంతకాలం పాటు పబ్లిక్ అప్పియరెన్స్‌లకు, మీడియా ప్రసారాలకు పూర్తిగా స్వస్తి పలకనున్నట్లు ఆమె ప్రతినిధి తెలిపారు. తాజాగా అరియానా కొత్త ఆల్బమ్ `పెటల్` మ్యూజిక్ వీడియో విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్యం, బరువుపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
చిన్నతనం నుంచే పరిశ్రమలో రూపురేఖలపై నిరంతరం ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న అరియానా నిరంతర వేధింపుల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అరియానా తీసుకున్న ఈ నిర్ణయానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఎంపైర్ స్ట్రీట్ ప్రొడక్షన్స్ సంస్థ తెలిపింది. అరియానా లేకుండానే అనుకున్న ప్రకారమే వచ్చే ఏడాది సదరు మ్యూజికల్ ప్రదర్శన ప్రారంభమవుతుందని.. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రొడ్యూసర్లు స్పష్టం చేశారు. సంగీత రంగంలోనూ, నటనారంగంలోనూ అద్భుత విజయాలు సాధించి మూడు గ్రామీ అవార్డులను దక్కించుకున్న అరియానా గ్రాండే ఈ విరామంతో మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన టూర్‌ను ఆనందంగా, ఆరోగ్యకరంగా ముగించుకుని కొద్దికాలం పాటు లైమ్‌లైట్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లకు అరియానా గ్రాండే తీసుకున్న ఈ నిర్ణయం మరో ఉదాహరణగా నిలుస్తోంది. గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవడమే కాకుండా వ్యక్తిగత ప్రశాంతత , మానసిక ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమని తన నిర్ణయంతో చెప్పకనే చెప్పారు. పాప్ దిగ్గజంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నా? అనవసరమైన ట్రోల్స్‌కు తలొగ్గకుండా తనను తాను కాపాడుకునేందుకు అరియానా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో కొంతమందికి ఆదర్శంగా నిలుస్తోంది.