ఇండియాలో టాప్ 3 హాలీవుడ్ చిత్రాలు!

ఈ చిత్రాల వరుసలో సరికొత్త సంచలనంగా నిలిచిన 'స్పైడర్ మన్: బ్రాండ్ న్యూ డే' విడుదలైన నాలుగు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించింది.

Update: 2026-08-04 09:36 GMT

ఇండియ‌న్ మార్కెట్‌లో హాలీవుడ్ సినిమాల ప్రభావం.. వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా విడుదలైన `స్పైడర్ మన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తోన్న‌ ప్రభంజనమే ఇందుకు మ‌రో నిదర్శనం. హాలీవుడ్ చిత్రాలు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఓపెనింగ్‌లను రాబడుతూ ఇండియన్ ఆడియన్స్‌ను ఏ విధంగా కట్టిపడేస్తున్నాయో? ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ఈ చిత్రాల వరుసలో సరికొత్త సంచలనంగా నిలిచిన 'స్పైడర్ మన్: బ్రాండ్ న్యూ డే' విడుదలైన నాలుగు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించింది.

దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 303 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ భారీ వసూళ్ల జోరుతో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల ఆల్ టైమ్ జాబితాలో ఈ సినిమా మూడో స్థానానికి దూసుకెళ్లింది. బాక్సాఫీస్ పీఠంపై మొదటి స్థానంలో జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం `అవతార్: ది వే ఆఫ్ వాటర్` అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతదేశంలో హాలీవుడ్ సినిమాల చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా ఇప్పటికీ తన రికార్డును పదిలంగా ఉంచుకుంది.

ఇండియన్ ప్రేక్షకులకు విజువల్ వండర్‌ను పంచిన ఈ చిత్రం ఇక్కడ సాధించిన వసూళ్లు అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి రిలీజ్ అయిన మాస్టర్ పీస్ `అవెంజ‌ర్స్: ఎండ్ గేమ్` నిలిచింది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోనూ ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతీ చోటా హౌస్‌ఫుల్ బోర్డులతో నడిచిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుదీర్ఘకాలంగా టాప్ పోజిషన్‌లో కొన‌సాగుతుంది.

హాలీవుడ్ సినిమాలకు భారత్‌లో లభిస్తున్న ఆదరణ నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాలు, మాస్ కేంద్రాలకు కూడా విస్తరిస్తోందని చెప్పడానికి ఈ వసూళ్లే నిదర్శనం. అడ్వాన్స్‌డ్ వీఎఫ్‌ఎక్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, మనసును హత్తుకునే ఎమోషన్స్ వంటి అంశాలతో పాటు స్థానిక భాషల్లోకి డబ్బింగ్ చేయడం వల్ల ఈ చిత్రాలు భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ మేకర్స్ కూడా ఇండియన్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

భ‌విష్య‌త్ లో మరిన్ని హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డులను బ్రేక్ చేయడానికి పోటీ పడే అవకాశం ఉంది. ఏదేఏమైనా? భారతీయ సినీ పరిశ్రమలో హాలీవుడ్ సినిమాల జోరు భవిష్యత్తులో మరింత పెరగనుందని.. దేశీయ మార్కెట్ వారికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News