చిరంజీవి మళ్లీ అటు అడుగులా? ఆయనకు ఓకే చెప్పారా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్లతోనే ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్లతోనే ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అదిరిపోయే సాంగ్స్, కిక్ ఇచ్చే ఫైట్లు, మాస్ ఎలివేషన్లు.. ఇవన్నీ కలిసిన సినిమాలే ఆయన కెరీర్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం కూడా అలాంటి సినిమానే అయిన మన శంకర్ వరప్రసాద్ గారుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2026 జనవరి 12న థియేటర్స్ లోకి రానున్నారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో మరోసారి వర్క్ చేస్తున్నారు చిరంజీవి. ఆ సినిమా అయ్యాక.. మెగాస్టార్ రస్టిక్, రియలిస్టిక్ సినిమాల వైపు మళ్లీ అడుగులు వేయవచ్చని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో వర్క్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా వెట్రిమారన్ వినిపించిన కథకు చిరంజీవి పాజిటివ్ గా స్పందించారనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వెట్రిమారన్ అంటేనే సహజత్వంతో కూడిన, మట్టి వాసన వచ్చే కథలు అందరికీ గుర్తుకు వస్తాయి. ఆడుకలం, విసారనై, వడ చెన్నై, అసురన్ వంటి అనేక సినిమాలతో ఆయన కంటెంట్ ఓరియెంటెడ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాంటి దర్శకుడు మెగాస్టార్ కు ఓ గట్టి, రియలిస్టిక్ కథను వినిపించారని, ఆ కాన్సెప్ట్ చిరంజీవికి బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం అధికారిక ప్రకటన రాకపోయినా, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే చిరంజీవి కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు - తమిళ సినీ ఇండస్ట్రీల ఓ విశేషమైన కలయికగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
ఏదేమైనా.. చిరంజీవి తన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన కంటెంట్ బేస్డ్ సినిమాలను మళ్లీ చేయాలని అనుకుంటున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు ఆయన అభిమానుల్లో తలెత్తుతోంది. 1980లలో స్వయంకృషి, రుద్రవీణ, చాలెంజ్ వంటి సినిమాల్లో ఆయన సామాజిక స్పృహ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. స్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగానే కాదు… నటుడిగా తన టాలెంట్ చూపించిన సినిమాలవి. ఇప్పుడు మళ్లీ అలాంటి రస్టిక్ కథల వైపు మొగ్గు చూపితే, అది అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చే అవకాశం ఉందనే చెప్పాలి.
అయితే మెగాస్టార్ కేవలం బాక్సాఫీస్ రిజల్ట్ కు పరిమితం కాకుండా, తన కెరీర్ ను మరింత స్ట్రాంగ్ గా మార్చే సినిమాలు చేయాలని భావిస్తున్నారట. కమర్షియల్ సినిమాలతో పాటు, కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడంలో ఆయన ఆసక్తి చూపుతున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ చిరు రస్టిక్ సినిమాల వైపు మళ్లీ అడుగులు వేయనున్నారన్న వార్త మాత్రం ఇప్పుడు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.