మేధా మాంజ్రేకర్ స్ఫూర్తినిచ్చే భావోద్వేగ ప్రయాణం!
నటుడు -దర్శకుడు మహేష్ మాంజ్రేకర్ భార్య, నటి మేధా మాంజ్రేకర్ క్యాన్సర్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నటుడు -దర్శకుడు మహేష్ మాంజ్రేకర్ భార్య, నటి మేధా మాంజ్రేకర్ క్యాన్సర్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ వార్త అభిమానులను, సినీ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో మేధా ప్రదర్శించిన మానసిక ధైర్యం .. సానుకూల దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. చికిత్సలో భాగంగా ఓ ముఖ్యమైన దశను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ధైర్యంగా ప్రకటించారు. ఈ కఠిన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను వివరించారు.
వ్యాధి గురించి, శస్త్రచికిత్స గురించి, కీమోథెరపీ , రేడియేషన్ గురించి ఆలోచించడం లేదన్నారు. ఆ సమయంలో తనకు లభించిన ప్రేమ, దైవకృప , తోటి వారి మద్దతు గురించి మాత్రమే గుర్తు చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని తానెప్పుడూ ఒంటరిగా చేయలేదని ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు తోడుగా నిలిచారని కృతజ్ఞ తాభావం వ్యక్తం చేశారు. వ్యాధితో పోరాడుతున్న క్రమంలో దైవం నిర్దిష్ట రూపంలోనే ముందుకు రాదని.. తన జీవితంలో వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు , అపరిచితుల రూపంలో దైవం ఎంతో సహాయం చేసిందన్నారు.
ఆకలి లేని సమయాల్లో తెలిసిన వారు నచ్చిన పదార్థాలను తీసుకురావడం, క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పడం వంటి చిన్న చిన్న విషయాలు మేధాకు ఎంతో ఊరటనిచ్చాయి. అలాంటి ప్రేమాభిమానాలే తనను ఈ దశకు చేరువ చేశాయని భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తెలు తన చేయి పట్టుకుని నడిపించిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక తల్లిగా తన పిల్లలను తానే రక్షించుకుంటానని అనుకున్నప్పటికీ ఇలాంటి పరీక్షా సమయంలో పిల్లలే తనకు బలమైన ఆసరాగా నిలిచారని గర్వంగా పేర్కొన్నారు. భర్త మహేష్ మాంజ్రేకర్ కూడా ఈ ప్రయాణంలో అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
క్లిష్టమైన సమయాల్లో మనుషుల పట్ల చూపే ప్రేమ, మద్దతు ఎంత గొప్ప మార్పును తీసుకొస్తుందో? ఈ ఘటన చాటి చెబుతోంది. మేధా మాంజ్రేకర్ చికిత్స సమయంలో తీసుకున్న ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోలలో మేధ చాలా దృఢంగా కనిపిస్తున్నారు. ఆమె పంచుకున్న ఈ సందేశం క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎంతోమంది రోగులకు కొండంత అండగా నిలుస్తుంది. భయం కంటే విశ్వాసం గొప్పదని, సరైన తోడ్పాటు ఉంటే ఎలాంటి కఠినమైన పరిస్థితినైనా? అధిగమించవచ్చని మేధా నిరూపిస్తున్నారు.
మేధా మంజ్రేకర్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతు న్నారు. మహేష్ మాంజ్రేకర్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి విజయవంతంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య మేధా కూడా అదే ధైర్యంతో చికిత్సను స్వీకరించి తిరిగి ఆరోగ్యవంతురాలిగా రావాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. మనిషిలోని నిశ్చలమైన ఆత్మవిశ్వాసం .. కుటుంబ సభ్యుల ప్రేమ కలిస్తే ఎలాంటి పరిస్థితులైనా ? జయించవచ్చని మేధా మాంజ్రేకర్ జీవిత ప్రయాణం ద్వారా మరోసారి నిరూపిస్తున్నారు.