'మయసభ' సిరీస్.. దేవ కట్టా ఫుల్ క్లారిటీ!

దర్శకుడు దేవా కట్టా ఫిక్షనల్ పొలిటికల్ వెబ్ సిరీస్ మయసభ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-14 05:58 GMT

దర్శకుడు దేవా కట్టా ఫిక్షనల్ పొలిటికల్ వెబ్ సిరీస్ మయసభ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మ‌డి ఏపీ సీఎం దివంగ‌త వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మ‌ధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్‌ ఆధారంగా చేసుకుని 1990లో ఉన్న ఆంధ్ర రాజకీయాలపై సిరీస్ ను దేవకట్టా తెరకెక్కిస్తున్నారు.

రాజకీయాల్లో భిన్న ధృవాలైన వైఎస్, సీబీఎన్ నిజ జీవితంలో ఒకప్పుడు మిత్రులు. యూత్ కాంగ్రెస్ లో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ ఆ తర్వాత రోజుల్లో వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్ల వారి దారులు వేరయ్యాయి. ఇప్పుడు మయసభ సిరీస్ వారిద్దరి మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఉంటుందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది.

కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి చంద్రబాబు నాయుడి పాత్ర‌లో న‌టిస్తుండగా, కీడాకోలా సినిమాతో మెప్పించిన చైత‌న్య రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషిస్తున్నారు. కానీ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా.. రెడ్డి, నాయుడు అనే పేర్లతో సిరీస్ ను నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించారు.

అయితే మయసభ టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో దేవ కట్టా స్పందించారు. గంట గంటకీ మయసభ సిరీస్ టీజర్‌ మీద పెరుగుతున్న మీ ఆసక్తికి, అన్ని ప్లాట్‌ ఫార్మ్స్‌ లో నుంచి వస్తున్న ట్రెండింగ్ రెస్పాన్స్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ నాయకుడు భక్తులైనా… నాయకులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక ఉన్నతమైన మానవీయ అనుభూతినిస్తుందని హామీ ఇచ్చారు. అది మాత్రం గ్యారంటీ అన్నారు. మయసభ ఎటువంటి రాజకీయ పక్షాలు తీసుకోదని, కానీ అత్యంత నిష్పాక్షికంగా సత్యాన్ని ప్రేరేపిస్తుందని పరోక్షంగా తెలిపారు.

భావోద్వేగ లోతు, స్థిరపడిన పాత్రలతో నిండిన ఆకర్షణీయమైన కథనాన్ని వాగ్దానం చేస్తూ, పార్టీ శ్రేణులకు అతీతంగా సంభాషణలను రేకెత్తించడం వెబ్ సిరీస్ లక్ష్యంగా తెలుస్తోంది. ఇక.. మయసభ సిరీస్ ను ఆగస్టు 7వ తేదీ నుంచి సోనీ LIV ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ, రాష్ట్ర కథగా మారిందని పేర్కొన్నారు.

Full View
Tags:    

Similar News