గొడ‌వ ప‌డితేనే అది మంచి సినిమాగా!

దర్శకుడు ఎంత గొప్పగా తీసినా? ఎడిటింగ్ లోపాలుంటే? ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదని హెచ్చరించారు.;

Update: 2026-05-02 16:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎడిటర్‌గా ప్రత్యేక ముద్ర వేసుకున్నారు మార్తాండ్ కె. వెంకటేష్. ఎన్నో సినిమాల‌కు మార్తాండ్ ఎడిట‌ర్ గా ప‌నిచేసారు. ఆయ‌న చేతులు మీదుగా ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల‌ని అందించారు. తాజాగా సినిమా మేకింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా అద్భుతంగా రావాలంటే దర్శకుడు- ఎడిటర్ మధ్య ఆరోగ్యకరమైన చర్చలు, అవసరమైతే గొడవలు కూడా జరగాలని అభిప్రాయపడ్డారు. కేవలం దర్శకుడు చెప్పింది మాత్రమే చేసే వ్యక్తి ఎడిటర్ కాదని సినిమాలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ చిత్రాన్ని మెరుగు పరిచే బాధ్యత ఎడిటర్‌పై ఉంటుందని స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో దర్శకుడు ఒక భావోద్వేగంతో ఉంటాడని కానీ ఎడిటర్ మాత్రం ప్రేక్షకుడి కోణంలో సినిమాను చూస్తాడని మార్తాండ్ అభిప్రాయ‌ప‌డ్డారు

దర్శకుడి కంటే ఎక్కువ సార్లు సినిమాను చూసే అవకాశం ఎడిటర్‌కే ఉంటుందని అందుకే ఎక్కడ సీన్లు సాగుతున్నాయి? ఎక్కడ ఎమోషన్ పండడం లేదు అనేది ఎడిటర్లకు స్పష్టంగా తెలుస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో దర్శకుడితో విభేదించినప్పుడే నాణ్యమైన అవుట్‌పుట్ వస్తుందన్నారు. ఎడిటర్ల సలహాలను, సూచనలను గౌరవించిన దర్శకులు పరిశ్రమలో గొప్ప విజయాలను అందుకున్నారని గుర్తు చేశారు. సినిమా ఎడిటింగ్ టేబుల్‌పై ఉన్నప్పుడు చేసే మార్పులు చిత్రం భవితవ్యాన్ని మారుస్తాయని అలా ఎడిటర్ మాట విన్న దర్శకులు నేడు అగ్రస్థానంలో ఉన్నారన్నారు.

దర్శకుడు ఎంత గొప్పగా తీసినా? ఎడిటింగ్ లోపాలుంటే? ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదని హెచ్చరించారు.

అయితే పరిశ్రమలో అందరు దర్శకులు ఒకేలా ఉండరని కొందరు దర్శకులు ఎడిటర్ల అభిప్రాయాలను వింటారని, మరికొందరు తమ మాటే నెగ్గాలని పట్టుబడతారన్నారు. తమ ఇగో కోసం ఎడిటర్ల సూచనలను తోసిపుచ్చిన వారు బాక్సాఫీస్ వద్ద పరాజయాలను మూటగట్టుకున్న సందర్భాలెన్నో చూసాన‌న్నారు. ఎడిటర్ చెప్పేది సినిమా మేలు కోసమే అనే విషయాన్ని కొంద‌రు దర్శకులు గ్రహిస్తారు? మ‌రికొంత మంది గ్ర‌హించ‌రు. అలాంటి వాళ్ల విష‌యంలో తాము కూడా వాళ్ల‌కు ఎలా కావాల‌నుకుంటే? అలా ఎడిట్ చేసి కంటెంట్ ఇచ్చేస్తామ‌న్నారు

మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా నిడివి విషయంలో ఎడిటర్ల పాత్ర మరింత పెరిగిందని మార్తాండ్ వివరించారు. నేటి ప్రేక్షకులు సాగదీత సీన్లను ఇష్టపడటం లేదని, కథను వేగంగా, ఆసక్తికరంగా నడిపించడంలో ఎడిటర్ చాకచక్యం కీలకమన్నారు. అందుకే ఎడిటింగ్ టేబుల్ వద్ద దర్శకులు మొండిగా వ్యవహరించకుండా చర్చల ద్వారా ఉత్తమమైన సినిమాను తీర్చిదిద్దాలని సూచించారు. దర్శకుడు- ఎడిటర్ మధ్య ఉండే సమన్వయమే సినిమాను మాస్టర్ పీస్‌గా మారుస్తుందని మార్తాండ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

Tags:    

Similar News