ఆరోసారి ఎన్నికల బరిలో దిగిన విలన్...!
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు నమోదు అవుతున్నాయి.;
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు నమోదు అవుతున్నాయి. అధికార డీఎంకే పార్టీని గద్దె దించేది తామే అంటే తాము అన్నట్లుగా అన్నాడీఎంకే పార్టీతో పాటు విజయ్ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఒక వైపు రాజకీయం చాలా సీరియస్‌గా రసవత్తరంగా సాగుతున్న సమయంలో మరో వైపు కొన్ని స్థానాల్లో పోటీ విషయంలో జోకులు పేలుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొందరు స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే కొందరు గెలవకున్నా వరుసగా ఎన్నికలు వచ్చిన ప్రతి సారి నామినేషన్ దాఖలు చేయడం మనం చూస్తూ ఉంటాం. వారు గెలవలేం అని తెలిసి కూడా జనాల వద్దకు ఓట్ల కోసం వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మన్సూర్ అలీ ఖాన్ కూడా అలాంటి వాడే.
విలన్ పాత్రలకు మన్సూర్ అలీ ఫేమస్...
మన్సూర్ అలీ ఖాన్ అంటే వెంటనే గుర్తు పట్టలేక పోవచ్చు, కానీ తమిళ్ తో పాటు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన నటుడు మన్సూర్ అలీ అంటే వెంటనే గుర్తుకు వస్తాడు. అంతే కాకుండా ఆ మధ్య స్టార్స్ పై, నటి పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ద్వారా కూడా వార్తల్లో నిలిచాడు. మన్సూర్ అలీ సినిమాలతోనే కాకుండా వివాదాలతోనూ గుర్తింపును దక్కించుకున్నాడు. అలాంటి మన్సూర్ అలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి వివాదం వల్ల కాదు, అలా అని సినిమా వల్ల కూడా కాదు. ఈ సారి మన్సూర్ అలీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన గురించి స్థానిక మీడియా ప్రముఖంగా కథనాలు ప్రచురిస్తూ వస్తుంది. సినీ నటుడు ఎన్నికల్లో అంటూ సోషల్ మీడియాలో కూడా మన్సూర్ అలీ గురించి ప్రముఖంగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఈ మన్సూర్ అలీ రాజకీయం గురించి మనం ఒక లుక్కేదాం పదండి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మన్సూర్ అలీ...
తమిళనాడులో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్ లాల్‌గుడి స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ప్రచారంను కూడా మొదలు పెట్టాడు. మన్సూర్ అలీ తాను పోటీ చేస్తున్న లాల్‌గుడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ఇబ్బందులు క్రియేట్ చేశారు అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మన్సూర్ అలీ నిరసన తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా మన్సూర్ అలీ పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలనే డిమాండ్‌ను ఆయన వినిపిస్తున్నాడు. తనను అసెంబ్లీకి పంపిస్తే నిత్యావసర వస్తువుల విషయమై పోరాటం చేస్తాను అంటూ ఆయన ఓటర్లకు హామీ ఇస్తున్నాడు.
పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ తమిళ నటుడు...
నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి వినూత్నంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉన్న మన్సూర్ అలీ గురించి స్థానికుల్లో చర్చ మొదలైందట. అయితే మన్సూర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం కాదని, ఆయన గతంలో జరిగిన 1999, 2009, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. అంతే కాకుండా 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయిదు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసిన విలన్ మన్సూర్ అలీ మరోసారి ఎన్నికల బరిలో నిలిచాడు. వెండి తెరపై విలన్‌గా మెప్పించిన మన్సూర్ అలీ రాజకీయ రంగస్థలంపై చేస్తున్న హడావిడి మాత్రం పట్టించుకోవడం లేదు. ఈసారి అయినా మన్సూర్ అలీ గెలుస్తాడు అనే నమ్మకం ఏ ఒక్కరిలోనూ లేదట. స్థానికంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప, ఆయనకు ఓటు వేయాలనే ఆలోచన లేదని ఒక మీడియా సంస్థతో చిట్ చాట్ సందర్భంగా అక్కడి ఓటర్లు చెప్పుకొచ్చారు. కానీ ఆయన మాత్రం విజయం పై చాలా ధీమాతో ఉన్నారట.