వాటన్నింటికి ముందుగానే సిద్దపడాలి : మాళవిక మోహనన్‌

మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌.;

Update: 2026-01-22 11:30 GMT

మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మలయాళం, తమిళ్‌, హిందీ, తెలుగు, కన్నడ భాషల సినిమాల్లో నటించింది. అంతే కాకుండా ఈమెకు స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, ధనుష్‌, మోహన్‌ లాల్‌, ప్రభాస్‌, విజయ్‌, విక్రమ్‌ తదితరులతో కలిసి నటించే అవకాశం దక్కింది. కేవలం హీరోయిన్‌ పాత్రలు, గ్లామర్‌ రోల్స్ మాత్రమే చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించేందుకు ఈమె ఎప్పుడూ రెడీ అన్నట్లుగా ఉంటుంది. తాజాగా ఈమె ప్రభాస్‌తో కలిసి రాజాసాబ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

రాజాసాబ్‌ సినిమాతో టాలీవుడ్‌లో...

రాజాసాబ్‌ సినిమా ప్రమోషన్ సమయంలో చాలా యాక్టివ్‌గా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు, టాక్‌ షోల్లో పాల్గొన్న మాళవిక మోహనన్‌ మంచి రీచ్‌ ను సొంతం చేసుకుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తెలుగులో ఈమెకు ముందు ముందు పెద్ద సినిమాల్లో ఛాన్స్‌ లు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌, హైట్‌ ఈ అమ్మడి సొంతం కావడం వల్లే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడు దక్కించుకుంటుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. కెరీర్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే చాలా మంది పెద్ద హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

మాళవిక మోహన్‌ మరిన్ని సినిమాలు...

ఇంకా మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగా ఏ భాషలో చేసినా అందరికీ రీచ్‌ అయ్యి పోవచ్చు. అందుకే ఫలానా భాష సినిమాలు మాత్రమే చేయాలి అనే ఆలోచన లేదు. తప్పకుండా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ కావాలి అనేది కోరిక అంది. మంచి సినిమాలకు పెద్దగా ప్రచారం లేకున్నా పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. అందుకే ఒకే పరిశ్రమకు పరిమితం అయ్యి సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. చిన్నప్పటి నుంచి కూడా క్రీడలు అంటే చాలా ఇష్టం. అథ్లెట్‌ ని కావడం వల్ల ఏ పనిలో అయినా ఈజీగా నన్ను నేను మార్చుకోగలను అంది. కొందరు ఫ్యాషన్ పేరుతో విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే చీర కట్టుకుని, నుదుట బొట్టు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, పువ్వులు పెట్టుకోవడం. ఈ ఫ్యాషన్ ఎప్పటికీ మారదు, కొత్తగా వచ్చిన ఫ్యాషన్‌లు కొన్నాళ్లకే మారుతున్నాయి. కానీ ఆ ఫ్యాషన్‌ మాత్రం ఎప్పటికీ మారదు అంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టే సమయంలో...

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్లు ఇక్కడ ఉండే నెగిటివిటీని తట్టుకునేందుకు ముందుగానే సిద్ధపడాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు, వృతి పరంగా ఎదురు అయ్యే సవాళ్లు, ట్రోల్స్ ఇలా ప్రతి విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలం అన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెగటివ్‌ ట్రోల్స్‌కి కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ట్రోల్స్ ను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కారణం లేకుండా ఊరికే ట్రోల్‌ చేయాలని, ఏదో ఒక కామెంట్‌ చేయాలని చూసే వారిని అసలు పట్టించుకోవద్దని కూడా మాళవిక చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నింటి గురించి ఆలోచిస్తే కెరీర్ పై దృష్టి పెట్టలేమని కూడా ఆమె పేర్కొంది. మొత్తానికి మాళవిక తన పదేళ్ల కెరీర్‌ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం మంచి దశలో ఉన్నట్లుగా పేర్కొంది.

Tags:    

Similar News