మా విడాకులలో విలన్ లేడన్న టీవీ నటి
జీవితం అనే ప్రయాణంలో మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయినా మేం ఒకరికొకరం మద్ధతుగా నిలుస్తాం.;
80లు 90లలోని హిందీ పాప్ కి వీరాభిమానులున్నారు. క్లాసిక్ డే ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ కొన్ని ఇప్పటికీ హృదయాలను ఏల్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో `తు తు హై వహీ...` మహి విజ్ పెర్ఫామ్ చేసిన సింగిల్ పాటలలో ఒకటి. డీజే రీమిక్స్ లో అదరగొడుతుంది. ఈ పాటకు మహి విజ్ అందచందాలు, అభినయం -ఆహార్యం ప్రధాన ఆకర్షణలు. కళ్లతోనే కోటి రాగాలు పలికిస్తుంది ఈ బ్యూటీ. తన అందమైన కళ్లకు విపరీతమైన ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఆల్బమ్ ఆద్యంతం మహి విజ్ సెంటర్ స్టేజ్ తీసుకుని రక్తి కట్టించింది. తు తు మై వహీ ఆల్బమ్ అప్పట్లో సంచలనం సృష్టించిందంటే మహి విజ్ దానికి కారణం.
ఆ తర్వాత నటి మహి విజ్ టెలివిజన్ రంగంలోను రాణించారు. టీవీ రంగంలో సహచర నటుడు జై భానుశాలిని పెళ్లాడారు. ఈ జంట పదేళ్ల దాంపత్యంలో ఒక కుమార్తె కలిగారు. మరో ఇద్దరిని పెంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. మహి- భానుశాలి తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఉమ్మడి నోట్‌ను షేర్ చేసి తమ గోప్యతను కాపాడాలని విన్నవించారు.
జీవితం అనే ప్రయాణంలో మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయినా మేం ఒకరికొకరం మద్ధతుగా నిలుస్తాం. శాంతి, పెరుగుదల, దయ, మానవత్వం ఎల్లప్పుడూ మా మార్గదర్శక విలువలుగా ఉన్నాయని తెలిపారు. ఈ జంట తమ ప్రాధాన్యత వారి పిల్లలేనని చెప్పారు. తామిద్దరూ ప్రేమ బాధ్యతతో సహ తల్లిదండ్రులుగా కొనసాగుతామని హామీ ఇచ్చారు. పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్ కోసం మేం ఉత్తమ తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండటానికి కట్టుబడి ఉన్నాం! అని నోట్ లో పేర్కొన్నారు. ఘర్షణ కంటే పరస్పర అవగాహనతో ముందుకెళుతున్నామని తెలిపారు.
మేము వేర్వేరు మార్గాల్లో ఉన్నా ఈ కథలో విలన్ లేడు. ఈ నిర్ణయంతో ఎటువంటి ప్రతికూలత లేదు. ఏదైనా తీర్మానాలు చేసే ముందు, డ్రామాల కంటే శాంతిని ఎంచుకున్నామని తెలుసుకోండి! అని ఈ జంట నోట్ లో రాశారు. ఒకరినొకరు గౌరవించుకుంటాము.. ఒకరినొకరు ఆదరిస్తాము.. స్నేహితులుగా ఉంటాము. మేము ఎప్పటిలాగే అని తెలిపారు.
మహి విజ్, జే భానుశాలి 2011లో వివాహం చేసుకున్నారు. 2017లో వారు ఇద్దరు పిల్లలు రాజ్‌వీర్ - ఖుషిని పెంచుకున్నారు. తరువాత 2019లో కుమార్తె తారను స్వాగతించారు.