దయచేసి ఎన్టీఆర్‌ను కలిపించండి.. మంత్రికి పేషెంట్ తల్లి లేఖ
పాతికేళ్ల తన కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతుందని, జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి మాట్లాడటమే స్వాతి చివరి కోరిక అని రజిత మంత్రికి లేఖ రాసింది.;
బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న తన కూతురు స్వాతి గురించి తెలంగాణ హుజూరాబాద్‌కు చెందిన తన తల్లి రజిత రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ రాశారు. పాతికేళ్ల తన కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతుందని, జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి మాట్లాడటమే స్వాతి చివరి కోరిక అని రజిత మంత్రికి లేఖ రాసింది.
హాస్పిటల్ బెడ్ పై ఉన్న తన కూతురి చివరి కోరికను ఎలాగైనా తీర్చాలని ఆమె మంత్రిని కోరారు. రజిత రాసిన లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఎలాగైనా ఈ విషయం ఎన్టీఆర్ కు చేరాలని తారక్ ఫ్యాన్స్ ఈ లెటర్‌ను తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గతంలో కూడా ఇలా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అభిమానులను కలిసిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్ లో క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన తన అభిమాని కౌశిక్ విషయంలో కూడా ఇదే జరిగింది. క్యాన్సర్ తో బాధ పడుతున్న కౌశిక్ తన చివరి కోరిక దేవర సినిమా చూసి చనిపోవడమే అని చెప్పగా, విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడి ధైర్యంగా ట్రీట్‌మెంట్ తీసుకోమని, చికిత్సకు కావాల్సిన ఖర్చంతా తానే భరిస్తానని కూడా హామీ ఇచ్చాడు.
ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ హాస్పిటల్ బిల్ మొత్తాన్ని భరించాడు. ఫ్యాన్స్ లేనిదే తాను లేనని ప్రతీసారీ చెప్పే ఎన్టీఆర్ తన అభిమానులకు ఏదైనా కష్టం ఉందని తెలిస్తే స్పందించడానికి కూడా అంతే ముందుంటాడు. ఇప్పుడు స్వాతి విషయం కూడా ఎన్టీఆర్ వరకు వెళ్లి ఆమె చివరి కోరిక తీరితే చాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్2 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్2 షూటింగ్ పూర్తవగానే తారక్, ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.