టాలీవుడ్ కు పెను విషాదం... ప్రముఖ నటుడు కోటా ఇకలేరు
తెలుగు చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు.. పాత్ర ఏదైనా అందులో జీవించే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.;
తెలుగు చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు.. పాత్ర ఏదైనా అందులో జీవించే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన 750కు పైనే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
విలనిజమైనా.. హాస్య పాత్రలైనా.. క్యారెక్టర్ పాత్ర అయినా.. ఆయన పాత్రలోకి ఒదిగిపోయేవారు. ఆయన నటనకు ఇట్టే కనెక్టు అయ్యేవారు. కొన్ని రోజులుగా అస్వస్థతకు గురై.. బాధ పడుతున్న ఆయన కన్నుమూసిన విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1942 జులై 10న క్రిష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు.
1978లో ప్రాణం ఖరీదు మూవీతో సినీ రంగంలోకి అరంగ్రేటం చేశారు. నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ఆయన బోలెన్ని పాత్రలు పోషించారు. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన ఆయన.. తెలుగువారికి సుపరిచితులు. 1999 - 2004 వరకు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సుదీర్ఘ సినీ జీవితంలో ఆయన నటించినచివరి సినిమా సువర్ణ సుందరి. ఈ సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ.. కన్నడ.. మలయాళం సినిమాల్లోనూ ఆయన నటించారు.
కోటా శ్రీనివాసరావు 750 చిత్రాల్లో నటించినప్పటికి కొన్ని చిత్రాలకు ఆయనకు భిన్నమైన ఇమేజ్ ను తెచ్చి పెట్టటమే కాదు.. ఆయన సినీ జివితంలో మర్చిపోలేని చిత్రాలుగా చెప్పాలి. అహనా పెళ్లంట.. ప్రతిఘటన.. యుముడికి మొగుడు.. ఖైదీ నెం.786.. శివ.. బొబ్బిలిరాజా.. యమలీల.. సంతోషం.. బొమ్మరిల్లు.. అతడు.. రేసుగుర్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలు ఆయన కెరీర్ లో కనిపిస్తాయి.
సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు కోటా నటన కారణంగా చెప్పాలి. ఎస్వీ రంగారావు.. కైకాల సత్యనారాయణ.. రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును తీర్చిన నటుడిడా కోటా శ్రీనివాసరావు అనే చెప్పాలి. ముచ్చెమటలు పట్టించే విలన్ గా.. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించటం ఆయనకు మాత్రమే సాధ్యం. సర్కార్ సినిమాలో సెల్వర్ మణిగా నటించి బిగ్ బి అమితాబ్ ప్రశంసల్ని అందుకున్నారు కోటా శ్రీనివాసరావు.
ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్.. కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో ఆయన బక్కచిక్కిపోయి.. కాలికి కట్టుతో కనిపించటంతో కోటాకు ఏమైందన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ పోస్టు పెట్టి.. ‘కోటా బాబాయ్ ను కలవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఇదే బయట ప్రపంచం ఆయన్ను చివరిసారిగా చూసిన సందర్భంగా చెప్పాలి. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఆయన తుదిశ్వాస విడిచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వారంతా షాక్ కు గురవుతున్నారు. పలువురు నటీనటులు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.