ఎవర్‌గ్రీన్ కామెడీ కాంబో కోటా-బాబు మోహన్!
సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనగానే హీరో - హీరోయిన్, హీరో - దర్శకుడి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.;
సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనగానే హీరో - హీరోయిన్, హీరో - దర్శకుడి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబోలో కామెడీ సీన్స్ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే పేరు పడిపోయింది. వీరిద్దరు కలిసి చేసిన మామగారు సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా పేరు తెలియకున్నా చాలా మంది సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లేదా ఫేస్ బుక్‌లో కోటా-బాబు మోహన్‌ల కామెడీ ఏదో ఒక సమయంలో చూసి ఉంటారు. బాబు మోహన్ అడుక్కు తినే వాడిగా కనిపించగా, కోటా కామెడియన్‌గా నటించారు.
ఆ సినిమాలో పదే పదే బాబు మోహన్‌ను కోటా శ్రీనివాసరావు వెనుక నుంచి తన్నడం నవ్వు తెప్పిస్తుంది. ఇద్దరి కాంబో సీన్స్ వల్లే సినిమా ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందని అంటారు. కేవలం మామగారు మాత్రమే కాకుండా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద వీరి కాంబో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, వీరి కాంబో కామెడీ సీన్స్ ఓ జనరేషన్ మొత్తం గుర్తుకుంచుకునే విధంగా ఉండటం వల్లే వీరిది హిట్ పెయిర్ అంటూ పేరు పడింది. అందుకే వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు కావాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకున్నారు. సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపైనా వీరు ఆకట్టుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కలిసి నటించలేదు. కానీ వీరిద్దరూ బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాము నటించిన సినిమాల గురించి మాట్లాడుతూ, అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరి ఇళ్లు కూడా ఒకే చోట ఉండేవని టాక్. హైదరాబాద్ వచ్చిన తర్వాత వీరిద్దరు కలిసి ఒకే చోట ఇళ్లు కొనుగోలు చేశారు. ఇద్దరూ రెగ్యులర్‌గా కలుసుకోవడం, తరచు మాట్లాడుకోవడం చేసేవారట.
కోటా శ్రీనివాసరావు మృతిపై బాబు మోహన్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బాబు మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అచేతనంగా ఉన్న కోటా శ్రీనివాసరావును చూసి బాబు మోహన్ తట్టుకోలేక పోయారు. నిన్న రాత్రే ఓ షూటింగ్ కోసం ఆయనతో మాట్లాడాను అన్నారు. తాను కోటా అన్నతో కలిసి చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు అందరితో సన్నిహితంగా ఉండేవారు, ఆయన గొప్ప నటుడు మాత్రమే కాకుండా ఆయన గొప్ప వ్యక్తి అని బాబు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కోటా - బాబు మోహన్ ఎవగ్రీన్ కామెడీ కాంబో అనడంలో సందేహం లేదు.