రివైజింగ్ క‌మిటీ ముంగిట ద‌ళ‌ప‌తి మూవీ!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్` జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సింది.;

Update: 2026-03-06 08:04 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్` జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సింది. అయితే సెన్సార్ వివాదం కార‌ణంగా సినిమా రిలీజ్ వాయిదాప‌డి ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు. సెన్సార్ వివాదంపై మేక‌ర్స్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. సింగిల్ జ‌డ్జ్ ధ‌ర్మాస‌నం సెన్సార్‌కు క్లియ‌రెన్స్ ఇస్తూ తీర్పు చెప్ప‌డం దానిపై సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు మ‌ళ్లీ కోర్టుని ఆశ్ర‌యించ‌డంతో సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టి వేస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

దీంతో అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. అభిమాన క‌థానాయ‌కుడు న‌టించిన చివ‌రి సినిమా చుట్టూ సెన్సార్ వివాదం త‌లెత్త‌డం ఏంటీ? అది రిలీజ్‌కు అడ్డంకిగా మార‌డం ఏంట‌ని అంతా వాపోతున్నారు. జ‌న‌వ‌రి 9కి వాయిదాప‌డిన ఈ మూవీ ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోక‌పోవ‌డం, సెన్పార్ వారు దిగిరాక‌పోవ‌డంతో `జ‌న నాయ‌గ‌న్` ఇప్ప‌ట్లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం లేద‌నే కామెంట్‌లు త‌మిళ‌నాట వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విజ‌య్ రాజ‌కీయ అరంగేట్రం చుట్టూ స‌మ‌స్య‌లు త‌లెత్తి ఉచ్చు బిగిస్తుండ‌టంతో విజ‌య్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.

దీనికితోడు త్రిష వివాదం కూడా మొద‌లు కావ‌డం, విజ‌య్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్ర‌యించ‌డం, ఆ కేసు ఏప్రిల్‌లో విచార‌ణ‌కు వ‌స్తుండ‌టంతో విజ‌య్ చుట్టూ ఏం జ‌రుగుతోంది? ఎందుకు ఇలా వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయని కోలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు అభిమానులు వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మేక‌ర్స్ మాత్రం ఈ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ వివాదం కార‌ణంగా కోర్టుని ఆశ్ర‌యించిన మేక‌ర్స్ ఇటీవ‌ల ఆ కేసుని విత్‌డ్రా చేసుకున్నారు.

అంతే కాకుండా సెన్సార్ స‌భ్యులు చెప్పిన క‌ట్స్‌కి అంగీకారం తెలిపి అన్ని మార్పులు చేసి రివిజ‌న్ క‌మిటీకి పంపించారు. వారి నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వ‌స్తుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మేక‌ర్స్ వ‌న్స్ రివిజ‌న్ క‌మిటీ నుంచి పిలుపు రాగానే సినిమా రిలీజ్ ఏర్పాట్ల‌ని చ‌క చ‌క చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. మార్చి 17 వ‌ర‌కు సెన్నార్ స‌ర్టిఫికెట్ వ‌స్తుంద‌ని, ఏప్రిల్‌లో సినిమాని రిలీజ్ చేయాల‌ని టీమ్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన‌ట్టుగా కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఏప్రిల్‌లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో విజ‌య్ టీవీకే పార్టీ పోటీ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఎన్నిక‌లు పూర్త‌యిన వారం త‌రువాత అంటే ఏప్రిల్ నెలాఖ‌రులో `జ‌న నాయ‌గ‌న్‌`ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఏర్పాట్లు చేస్తోంది. మ‌రి మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టే రివిజ‌న్ క‌మిటీ క్లియ‌రెన్స్ ఇచ్చేసి సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుందా? అన్న‌ది తెలియాలంటే మార్చి 17 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. తెలుగు సూప‌ర్ హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా ఈ మూవీని కొన్ని కీల‌క మార్పుల‌తో రూపొందించారు. పూజా హెగ్డే, మ‌మితా బైజు, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Tags:    

Similar News