పెద్ది.. అచ్చియమ్మ సర్ ప్రైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా.. ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి.
శుక్రవారం (మార్చి 6) జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీ టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా జాన్వీ కపూర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
"మీతో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలో మీ పవర్ ఫుల్ పాత్రను ప్రేక్షకులు వెండితెరపై చూసే రోజు కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు. అయితే సినిమాలో జాన్వీ అచ్చియమ్మ అనే పాత్రలో కనిపించనుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతిగా ఆమె పాత్రను దర్శకుడు రూపొందించినట్లు సమాచారం.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చికిరి సాంగ్ ద్వారా జాన్వీ పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆ పోస్టర్ లో జాన్వీ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ లో కూడా ఆమె లుక్ ఆకర్షిస్తోంది. వీడియోలో జాన్వీ కనిపించే విజువల్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ఉండే యువతిగా ఆమె పాత్ర మాస్ టచ్ తో ఉంటుందనే తెలుస్తోంది.
చీరలో సంప్రదాయంగా కనిపిస్తూ, కళ్లద్దాలు పెట్టుకుంటున్న చిలిపి యువతిగా ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పెద్ది సినిమాలో జాన్వీ పాత్రపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఆ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో సాగే రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 1980ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది.
విలేజ్ స్పోర్ట్స్, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు బొమ్మన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసుకుని మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.